కొబ్బరికి కంచిలి ప్రధాన మార్కెట్‌గా పేరుగాంచింది. ఈ మార్కెట్ నుంచి ఉత్తరప్రదేశ్, డిల్లీ, రాజస్థాన్, బీహార్ వంటి ప్రాంతాలకు నాణ్యమైన కొబ్బరి ఎగుమతి జరిగేది. 1999 పెను తుఫాన్ తర్వాత వ్యాపారం సన్నగిల్లింది. ఏటా వరుస తుఫాన్ల తాకిడితో దిగుబడి తగ్గడంతో మార్కెట్‌పై ప్రభావం చూపింది. తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తి పెరగడంతో ఉత్తరాదికి ఇక్కడి నుంచి వెళ్లే ఎగుమతులు తగ్గాయి. గతంలో ఉద్దానంలో వెయ్యి కాయల ధర రూ.10వేల నుంచి రూ.15వేల లోపు ఉండేది. ప్రస్తుతం సుమారు రూ.22వేలు పలుకుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లో రిటైల్‌గా ఒక్కో కాయ రూ.30కు విక్రయిస్తున్నారు. కాగా.. ధర పెరిగినా.. కొబ్బరికాయల దిగుబడి తగ్గడంతో రైతులకు కన్నీరే మిగులుతోంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కొబ్బరి రైతులు కోరుతున్నారు.