గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు అని ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ..... సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్‌షాపల్ నిర్వాహణ కొనసాగించారు. హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్ వెళ్ళిన మంత్రి నారా లోకేష్ అక్కడ కూడా తన రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.