ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టు తరఫున అతిపిన్న వయసు (16 ఏళ్ల 291 రోజులు)లో శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు.తద్వారా, గతంలో తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్ (20 ఏళ్ల 18 రోజులు) పేరిట ఉన్న రికార్డును రాకీ బద్దలుకొట్టాడు. ఆండ్రూ 1998లో కెన్యాపై సెంచరీ చేయగా... 26 ఏళ్ల తర్వాత రాకీ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌పై ఈ రికార్డు సాధించాడు. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జట్టు పీకలోతు కష్టాల్లో ఉన్నప్పుడు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాకీ ఫ్లింటాఫ్ అద్భుతమైన సెంచరీ (124 బంతుల్లో 108 రన్స్)తో ఆదుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు 316 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా ఎలెవెన్ టీమ్ తన తొలి ఇన్నింగ్స్ లో 214 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 102 పరుగులు లీడ్‌ను సాధించింది.