ఎస్సీ వర్గీకరణను చేపట్టి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మానుకోవాలని, వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నయకుడు, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. అరసవల్లి నగరంలోని స్థానిక ఓ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఓబీసీ లు ఉన్నారని, కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు ఓబీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారని ప్రశ్నించారు. ఏకసభ్య కమిషన్‌ను రద్దు చేసి ఎస్సీలను విభజించే పనిని ఆపకుంటే రాష్ట్రంలో ఎస్సీ, ఓబీసీలను ఏకతాటి పైకి తీసుకొస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్నదని, అటువంటి సంస్థకు కేవలం రూ.11400 కోట్లు ఇస్తే ఏం సరిపోతుందని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి వేలకోట్ల రూపాయలు అప్పులు చేసి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుండడం సరికాదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటు తెచ్చుకో వాలన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోని ధనిక రాజకీయ నాయకుల్లో ప్రథమ స్థానంలో ఉన్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.షన్ముఖరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లఖినేని నారాయణరావు పాల్గొన్నారు.