ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ,,,,గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 08:33 PM

తాము అధికారంలోకి వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఇంటి స్థలాల పంపిణీ చేపట్టాలని ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. అలాగే లబ్ధిదారుల ఎంపిక కోసం త్వరలోనే ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక అప్ డేట్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.


మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1.14 లక్షల ఇళ్లు నిర్మించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన తణుకు మండలం తేతలిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండో విడతలో ఏపీలో ఆరు లక్షల ఇళ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇదే సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మంత్రి పార్థసారథి.. దీనిపై త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు.


మరోవైపు ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వం ప్రాధాన్యాలను గుర్తించినట్లు సమాచారం. వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 22.80 లక్షల ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. అయితే ఇందులో సుమారు 7 లక్షల మందికి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు జరగలేదు. వీరితో పాటుగా మరో లక్షన్నర మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీలో వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, గతంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇళ్ల స్థలాలు పొందని వారికి మాత్రమే అవకాశం ఇస్తారని సమాచారం. అలాగే ఇంటి పట్టాల పంపిణీ కోసం కొత్తగా ఎలాంటి భూమి కొనుగోలు చేయకుండా.. ప్రభుత్వం వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమిలోనే అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com