తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. మంగళవారం కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకోకపోవడంతో కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది. సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో పాటు తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడం, పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో భక్తులు తగిన సంఖ్యలో రావడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరిగి మార్చి నెలాఖరు నుంచి రద్దీ ప్రారంభమవుతుందని టీటీడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏడాది ఫిభ్రవరి నెలలో ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.పరీక్షలు దగ్గరపడటంతో...తిరుమలలో ఎప్పుడూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎంత తక్కువగా ఉన్నా అరవై వేల మంది భక్తులు తిరుమలకు ప్రతి రోజూ చేరుకుని ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక మార్చి నెల నుంచి పరీక్షలు పూర్తి కానుండటంతో అప్పటి నుంచి జులై వరకూ రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు ముందుగానే చేయాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి రోజూ ఏరోజు కారోజు ఎస్ఎస్ డి టోకెన్లు తిరుపతిలో జారీ చేస్తుండటంతో కొంత భక్తుల రద్దీ తిరుమలలో కనిపిస్తుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఎనిమిది గంటలు...ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,278 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,077 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.