యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన వందల సంస్థలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులకు వేతనాల్లో ఎటువంటి కోత విధించకుండా వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రముఖ ఛారిటీలు, మార్కెటింగ్, టెక్నాలజీ సంస్థలు సహా 200 కంపెనీలు ఈ పని విధానానికి మారినట్లు యూకే పత్రిక గార్డియన్ వెలువరించింది. ‘4 డే వీక్ ఫౌండేషన్’ క్యాంపెయిన్ సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. ఈ విధానంతో ఆయా సంస్థల్లోని 5 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారని తెలిపింది.
ఈ అంశంపై ‘4 డే వీక్ ఫౌండేషన్’ క్యాంపెయిన్ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ.. ‘‘ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు షిఫ్ట్, వారానికి ఐదు రోజుల పని అనేవి వందేళ్ల కిందటి విధానం... ప్రస్తుత అవసరాలకు ఇవి అంతగా పనికిరావు... మనం అప్డేట్ అవ్వాల్సిన సమయం వచ్చింది.. నాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులకు 50 శాతం కంటే ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది.. దాంతో వారు సంతృప్తికరమైన జీవితాలను గడిపేందుకు స్వేచ్ఛ లభిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘వందలాది బ్రిటిష్ కంపెనీలు, ఓ స్థానిక ప్రభుత్వ కార్యాలయం తమ ఉద్యోగులకు పూర్తి వేతనంతో నాలుగు రోజుల పని విధానం అమలు చేస్తున్నాయి...’ అని అన్నారు.
తొలుత నాలుగు రోజుల పని విధానాన్ని బ్రిటన్లోని దాదాపు 30 మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ప్రెస్ రిలేషన్స్ సంస్థలు అమలు చేశాయి. ఆ తర్వాత 29 స్వచ్ఛంద సంస్థలు, 24 టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థలు.. 22 మేనేజ్మెంట్, కన్సల్టింగ్ సంస్థలు వాటిని అనుసరించాయి. అత్యధికంగా లండన్లో 59 సంస్థలు ఈ నూతన పని విధానాన్ని అమలు చేస్తున్నట్టు నివేదించాయి. ఈ విధానం వల్ల ఉద్యోగులను ఆకర్షించడంతో పాటు వారు ఎక్కువ కాలం సంస్థలో పనిచేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల సృజనాత్మకతతో కూడిన ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలోనే వారానికి నాలుగు రోజుల పని విధానం మొదలైంది.. అప్పటి నుంచి చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా JP మోర్గాన్ చేజ్, అమెజాన్ వంటి అనేక అమెరికా ఆధారిత కంపెనీలు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాలని కఠిన ఆదేశాలు జారీచేయడంతో చాలా మంది తమ ఉద్యోగాలను వదిలిపెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల పని విధానం తెరపైకి వచ్చింది. దీనికి బ్రిటన్లోని లేబర్ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. ఇక, 18-34 ఏళ్లలోపు ఉండే యూకే యువతలో 78 శాతం మంది ఈ విధానాన్ని కోరుకుంటున్నట్ుట స్పార్క్ మార్కెట్ రిసెర్చ్ సర్వేలో వెల్లడయ్యింది.