మూడో టీ20 మ్యాచ్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏకంగా 5 వికెట్లు తీశాడు. అయితే చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ బ్యాట్ ఝుళిపించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171/9 పరుగులు చేసింది. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే.. సిరీస్ వశం అవుతుంది.
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 171/9 పరుగులు చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. అర్షదీప్ సింగ్‌కు విశ్రాంతి ఇచ్చిన భారత్.. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లాండ్.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు బ్యాటర్లు శుభారంభం అందించారు. ఫిలిప్ సాల్ట్ (5) త్వరగానే ఔట్ అయినా.. మరో ఓపెనర్ బెన్ డకెట్ (51) ఎదురుదాడికి దిగాడు. సిక్స్‌లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జోస్ బట్లర్ (24) కూడా అతడికి సహకరించాడు. దీంతో ఇంగ్లాండ్ ఓ దశలో 8.5 ఓవర్లలో 83/1తో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 200 పైచిలుకు స్కోరు చేస్తుందని అంతా భావించారు.
వరుణ్ చక్రవర్తి పాంచ్ పటాకా..
ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను కకావికలం చేశాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీసిన ఈ స్పిన్నర్.. తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్.. 127/8తో నిలిచింది. మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో లియాన్ లివింగ్ స్టోన్ బ్యాట్ ఝుళిపించాడు. 24 బంతుల్లో 43 రన్స్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోరు 170 పరుగుల మార్కును దాటింది. చివరకు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ.. 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చాడు. అతడికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు.