బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లకుపైగా ప్రజలకు పారదర్శకంగా అందించిన పాలకుడు విధ్వంసకారుడా? లేక ఐదేళ్లలో ఏమీ చేయకుండా మాటలతో మభ్యపుచ్చి సింగపూర్ గ్రాఫిక్స్ చూపించిన నాయకుడు విధ్వంసకారుడా? అని వైసీపీనేతలు ప్రశ్నించారు. వారు మాట్లాడుతూ.... ఇచ్చాపురం నుంచి హిందుపురం దాకా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సచివాలయాలు, పది ఉద్యోగాలు, ఆర్బీకేలు, ఆస్పత్రులు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తీసుకొచ్చిన వ్యక్తి విజన్ ఉన్న లీడరా? లేక 14 ఏళ్లు పాలించినా.. ఆంధ్రప్రదేశ్‌లోని 14 వేల పంచాయితీల్లో ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఒక్క పథకమూ గుర్తు రాకుండా.. నాది అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న వారికి విజన్ ఉన్నట్లా? అని ప్రశ్నించారు.
ఒక ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు మూలధన వ్యయం, అప్పుల వృద్ధి తీరును కొలమానంగా పరిగణిస్తారు. ఆ లెక్కలన్నీ చూశాక ఆర్థిక క్రమశిక్షణతో ఎవరు పాలన సాగించారో ప్రతి ఒక్కరూ చెబుతారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆరోపణలకు దిగారు. కానీ ‘కాగ్’ లెక్కలు, అధికారిక గణాంకాలను ఎవరూ దాచిపెట్టలేదు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే బాదుడే.. బాదుడు! ఆయన అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. భావి తరాల కోసం గత ప్రభుత్వం సృష్టించిన విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్‌కు బేరం పెడుతున్నారు. ఇవన్నీ దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కన్నార్పకుండా అబద్ధాలు వల్లిస్తున్నారు. 2023–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధికంగా మూలధన వ్యయం చేసిందని, అయితే దాన్ని వదిలేసి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పని కాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.గతంలో చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో తక్కువగా అప్పులు చేయడమే కాకుండా మూలధన వ్యయం అధికంగా చేసింది. 2022–23లో వైఎస్సార్‌సీపీ రూ.67,985 కోట్లు అప్పు చేసి మూలధన వ్యయం రూ.7,244 కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు తప్పుబట్టారు. మరి ఈ ఆర్థిక ఏడాదిలో రూ.73,635.92 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు మూలధన వ్యయం కేవలం రూ.8,894.98 కోట్లే చేసిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు? అని సూటిగా ప్రశ్నించారు.