ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో ఉన్న భీతావహ పరిస్థితులకు సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి. తొక్కిసలాట తర్వాత కన్పించిన దృశ్యాలు చూస్తే.. అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో భక్తులు తీసుకువచ్చిన బ్యాగుల కుప్పలు కనిపిస్తున్నాయి. భక్తుల బట్టలు, చెప్పులు, బూట్లు చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా భక్తులు భావిస్తారు.
ఈ మౌని అమావాస్య రోజు అక్కడ పుణ్య స్నానాలు చేస్తే.. ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందనే భక్తులు నమ్ముతారు. అందుకే ఇవాళ మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో.. వారిని అడ్డుకోవడం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్లిన భక్తులు కొందరు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా.. అవి విరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. అనంతరం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని భక్తులు.. తమ బ్యాగులను పట్టుకుని పరుగులు తీయలేక కింద పడ్డారు. మిగితా భక్తులు అలాగే వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది.
అయితే ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమైనా.. పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. గాయపడిన వారని తరలించేందుకు అంబులెన్స్‌లను రప్పించగా.. వాటిని బయటికి పంపించే మార్గాలు కూడా మూసుకుపోయాయి. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అంబులెన్స్‌కు దారి చూపడంతో గాయపడిన వారు బయటపడ్డారు. ఇక ఘటనా స్థలంలో భక్తుల బ్యాగులు, చెప్పులు, బట్టలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రస్తుతం తొక్కిసలాట జరిగిన మహా కుంభ్ నగర్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. తొక్కిసలాట నేపథ్యంలో పుణ్యస్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయగా.. మరికొన్ని కోట్ల మంది స్నానాలు చేయడానికి వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. త్రివేణి సంగమం ఘాట్ల వద్దకు భక్తులు వెళ్లే మార్గంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. భక్తులకు సాయం చేసేందుకు వాలంటీర్లు, స్థానిక అధికార యంత్రాంగం నిరంతరం పనిచేస్తోంది.