భారత స్టాక్ మార్కెట్ సూచీలు ప్రతి శనివారం, ఆదివారం మూసివేసి ఉంటాయన్న సంగతి తెలిసిందే. వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు ట్రేడింగ్ ఉంటుంది. అయితే ఇంకొన్ని పబ్లిక్ హాలిడేస్ సహా బీఎస్ఇ, ఎన్ఎస్ఇప్రధాన కార్యాలయాలు ఉండే ముంబైలో ఎన్నికలు, ఇతర ప్రధాన పండగలు ఏమైనా ఉంటే అప్పుడు కూడా స్టాక్ మార్కెట్ హాలిడే ఉంటుంది. ప్రతి ఏడాది ఆరంభంలోనే ఎన్ఎస్ఇ (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి).. ఆ సంవత్సరానికి సంబంధించి హాలిడేస్ లిస్ట్ కూడా విడుదల చేస్తుంటుంది. అయితే ఈ శనివారం మాత్రం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉండనుంది. అదేంటి శనివారం మార్కెట్ ఏంటి అనిపిస్తుందా.. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.
బడ్జెట్ రోజున శనివారం.. ఎప్పటిలానే సాధారణ టైమింగ్స్తోనే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఈ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ సెషన్ కూడా 9.15 నుంచి 3.30 గంటల వరకు సాగనుంది. ఇంతకుముందు కూడా ఇలా బడ్జె్ట్ రోజున శనివారం అయినప్పటికీ.. రెండు సార్లు ట్రేడింగ్ జరిగింది. 2020, ఫిబ్రవరి 1న; 2015 ఫిబ్రవరి 28న బడ్జెట్ శనివారం ప్రవేశపెట్టారు.
బ్లాక్ డీల్ మీటింగ్- 1 ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగనుంది. స్పెషల్ ప్రీఓపెన్ సెషన్ (ఐపీఓ, రీలిస్టెడ్ సెక్యూరిటీల కోసం) ఉదయం 9- 9.45 వరకు ఉండనుంది. కాల్ ఆక్షన్ ఇల్లిక్విడ్ సెషన్ (గంట చొప్పున 6 సెషన్లు) 9.30 నుంచి 3.30 వరకు ఉంటుంది. బ్లాక్ డీల్ సెషన్- 2 మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 2.20 వరకు సాగనుంది. పోస్ట్ క్లోజింగ్ సెషన్ 3.40 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ట్రేడ్ మాడిఫికేషన్ కటాఫ్ టైమ్ 4.15గా నిర్ణయించింది.
కేంద్ర బడ్జెట్ అనేది అతిపెద్ద ఈవెంట్లలో ఒకటిగా చెప్పొచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా రాబోయే ఏడాది కాలానికి సంబంధించి ఆదాయ, వ్యయాల లెక్కల్ని వెలువరిస్తుంటుంది. ఆయా రంగాలకు కేంద్రం కేటాయింపుల్ని బట్టి.. చేసే ప్రకటనల్ని బట్టి.. తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతుంటాయి. ఇది స్టాక్ మార్కెట్లపై చూపే ప్రభావాన్ని ఇంట్రాడే ట్రేడర్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తారు. చివరిసారి 2024, జులై 23న మధ్యంతర బడ్జెట్ సమయంలో ఇలాగే ఒడుదొడుకుల్లో ట్రేడయి చివరకు సెన్సెక్స్ 70 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 30 పాయింట్లు తగ్గింది. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.