ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 07:23 PM

రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. ఫిబ్రవరి నాలుగో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి శుక్రవారం సమావేశమైంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సందర్భంగా.. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్టిలో ఉంచుకొని రథసప్తమి కోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. శుక్రవారం టీటీడీ పాలకమండలితో భేటీ అయ్యారు.


మరోవైపు రథసప్తమి సందర్భంగా తిరుమలకు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనసేవ జరుగుతుంది. అలాగే ఏడు వాహనాలపై విహరిస్తూ ఆ రోజు శ్రీవారు దర్శనమిస్తారు. వాహన సేవలన్నీ ఒకే రోజు చూసే అవకాశం ఉండటంతో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. రథ సప్తమి రోజున భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ఆర్జిత సేవలు, దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ వివరాలు వెల్లడించారు.


రథసప్తమి రోజున పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. అలాగే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి మూడో తేదీన తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వివరించారు. రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు నిర్ధేశిత సమయానికి దర్శనానికి రావాలని సూచించారు. నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా శ్రీవారి దర్శనానికి పంపిస్తారు. మరోవైపు గ్యాలరీలో వెళ్ళే భక్తుల కోసం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. మాడవీధుల్లో వాహన సేవలను చూసేందుకు వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా ఆహార, పానీయాలు అందించనున్నారు.


రథసప్తమి రోజున ఆలయం చుట్టూ సీనియర్ అధికారులతో పర్యవేక్షణ జరగనుంది. భక్తుల కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎనిమిది లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌లో ఉంచినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరుగుతోందని టీటీడీ ఛైర్మన్ వివరించారు. మరోవైపు తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది గురువారం రోజున తిరుమల శ్రీవారిని 51,349 మంది భక్తులు దర్శించుకున్నారు.14,082 మంది తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా గురువారం శ్రీవారి హుండీ ద్వారా రూ.3.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com