తిరుపతిలో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఇటీవల నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లింకు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు తిరుపతి సమీపంలో భారీగా నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యవహారం తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. నకిలీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో జనవరి 29న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీ లేబుళ్లు అతికించి నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు.. 591 బాటిళ్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి విచారణలో పలు కీలక విషయాలు తెలిశాయి. తిరుపతి సమీపంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తిరుపతి సమీపంలోని, దామినేడు ఎన్టీఆర్ కాలనీలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి భారీగా మెటీరియల్ను గుర్తించారు. ఈ ప్రాంతంలో నకిలీ మద్యం తయారుచేసి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే ఈ నకిలీ మద్యం తయారీ వెనుక వెంకటరమణ అనే 45 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతని కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి 805 లీటర్ల మద్యం, 6600 ఖాళీ బాటిల్స్, పలు బ్రాండ్ల నకిలీ లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు,