ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోనియాగాంధీ వ్యాఖ్యలు.. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

national |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 08:20 PM

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ.. ప్రసంగం చివరికి వచ్చేసరికి ద్రౌపది ముర్ము బాగా అలసిపోయారని.. ఆమె మాట్లాడలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి కార్యాలయం కూడా సోనియా గాంధీ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఇవి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. సోనియా గాంధీ లాంటి నాయకురాలు రాష్ట్రపతిని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు." అని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.


ఏ సమయంలోనూ రాష్ట్రపతి అలసిపోలేదని.. అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడేటపుడు రాష్ట్రపతికి అలసట రాదని స్పష్టం చేసింది. రాష్ట్రపతిపై వ్యాఖ్యలు చేసిన వారికి భారతీయ భాష, యాసలతో పరిచయం లేకపోయి ఉండొచ్చని.. అందుకే అలసిపోయినట్లు అనిపించొచ్చని తెలిపింది. ఏది ఏమైనా రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని.. ఇవి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


  ముర్ముపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు. రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ అహంకారం, అగౌరవాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాజకుటుంబం అహంకారం చూడండి.. గిరిజన నేపథ్యం నుంచి వచ్చి ద్రౌపది ముర్ముని అవమానించారని విమర్శించారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ జమిందారీ మైండ్‌సెట్ అని.. ఆ విషయాన్ని అంగీకరించలేకపోతోందని మండిపడింది. అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని వారు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ఎంపీ సుకంతా మజుందార్ విమర్శించారు.


రాష్ట్రపతిపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం అవుతున్న వేళ.. వయనాడ్ ఎంపీ, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. రాష్ట్రపతి అంటే సోనియా గాంధీకి చాలా గౌరవం ఉందని.. అయితే తన తల్లి చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆమె తప్పుపట్టారు. క్షమాపణ చెప్పాల్సింది సోనియా గాంధీ కాదని.. దేశాన్ని నాశనం చేసిన బీజేపీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సోనియా గాంధీ వయసు 78 ఏళ్లు అని.. రాష్ట్రపతి వయసు కూడా ఎక్కువేనని.. వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.


శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు.. సాధించిన విజయాలపై తన ప్రసంగంలో రాష్ట్రపతి చదివి వినిపించారు. ఇక మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే 3 రెట్లు వేగంతో పనిచేస్తోందని తెలిపారు. త్వరలోనే ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని ప్రస్తావించారు. ప్రసంగం మొదట్లోనే మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు రాష్ట్రపతి శ్రద్ధాంజలి ఘటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com