దేశవాళీ మ్యాచ్ అంటే ఏదో సప్పగా సాగుతుందన్న ప్రచారం ఉంటుంది. స్టార్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండరు కాబట్టి అభిమానుల తాకిడీ తక్కువగానే ఉంటుంది. అయితే.. చానాళ్ల తర్వాత మళ్లీ ఒక దేశవాళీ మ్యాచ్‌లో మునుపటి జోష్ కనిపించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దేశవాళీ బరిలోకి దిగితే ఆ మాత్రం ఉండదా మరి. ఊహించిన దాని కంటే ఎక్కువగా.. విరాట్ కోహ్లీ కరిష్మా రంజీ ట్రోఫీకి సరికొత్త జోష్ తీసుకొచ్చింది. రంజీ ట్రోఫీలో భాగంగా.. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తన దేశవాళీ జట్టు ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. దీంతో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో సాధారణ రంజీ మ్యాచ్.. అంతర్జాతీయ మ్యాచ్‌ను తలపించింది. స్టేడియం మొత్తం కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలతో హోరెత్తింది.
గురువారం రోజు ఢిల్లీ, రైల్వేస్ మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ.. ఆ మ్యాచ్‌లో స్కోర్ల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆటంతా కోహ్లీ చుట్టూనే సాగింది. కోహ్లీ నినాదాలతోనే మార్మోగిపోయింది. అన్నింట్లోనూ కోహ్లీ గురించే చర్చ. కోహ్లీ ఆడుతున్నాడు. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నాడు. తనదైన శైలిలో అభిమానుల్ని అలరిస్తున్నాడంటూ ట్విట్టర్‌లోనూ కోహ్లీదే సందడి కనిపించింది. తొలి రోజు రైల్వేస్ బ్యాటింగ్ చేయగా.. విరాట్ మొత్తం ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. శుక్రవారం రోజు కోహ్లీ.. బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్.. 67.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఉపేంద్ర యాదవ్ (95), కర్ణ్ శర్మ (50) రన్స్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో సుమిత్ మాథుర్, నవ్‌దీప్ సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ వికెట్ నష్టానికి 41 రన్స్‌తో ఉంది. సనత్ సంగ్వాన్ (9), యష్ ధుల్ (17) క్రీజులో ఉన్నారు. మరో వికెట్ పడితే విరాట్ బ్యాటింగ్‌కు వస్తాడు. దీంతో కోహ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉండటంతో.. ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడని తెలిసి తొలిరోజు.. అభిమానులు పెద్ద సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియానికి విచ్చేశారు. 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంటే.. అంతకంటే ముందే అక్కడికి భారీగా జనం వచ్చారు. అయితే ఇదే సమయంలో గేట్ నంబర్- 16 దగ్గర పరిస్థితి అదుపుతప్పి చిన్నపాటి తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది. పలువురు అభిమానులు గాయపడ్డారని సమాచారం.
మ్యాచ్ కోసం ముందుగా ముందుగా 6 వేల మంది పట్టేలా సామర్థ్యం ఉన్న.. గౌతమ్ గంభీర్ స్టాండును ఢిల్లీ క్రికెట్ సంఘం ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచగా.. అభిమానుల తాకిడి నేపథ్యంలో 11 వేల సామర్థ్యం ఉన్న బిషన్‌సింగ్ బేడీ స్టాండును కూడా తెరిచింది. శుక్ర, శనివారాల్లో మొహిందర్ అమర్‌నాథ్ స్టాండును కూడా అందుబాటులో ఉంచాలని డీడీసీఏ నిర్ణయించింది.