టీమిండియా అమ్మాయిలు వరుసగా రెండోసారి ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవడం పట్ల భారత్ లో సంబరాలు చేసుకుంటున్నారు. జాతి గర్వించేలా చేశారంటూ టీమిండియా అమ్మాయిల జట్టుపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా భారత జట్టు అద్భుతమైన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేశారు. "టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్-19 అమ్మాయిల జట్టుకు అభినందనలు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో మీ కఠోర శ్రమ, పట్టుదల, దృఢ సంకల్పంతో 9 వికెట్ల తేడాతో ఘనతర విజయం సాధించారు. తద్వారా ప్రతి భారతీయుడు గర్వించేలా చేశారు. దేశానికి పేరు తీసుకురావడం మాత్రమే కాదు, లెక్కలేనంతమంది బాలికలకు ప్రేరణగా నిలిచారు. యావత్ దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.