కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత జోగి రమేష్ మండిపడ్డారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం చూసి ప్రజాస్వామికవాదులు నివ్వెర పోతున్నారని ఆయన తెలిపారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినా సరే గద్దెనెక్కాలని తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు, దాడులతో దిగజారుడు రాజకీయం చేస్తోందని అన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...... రాష్ట్రంలోని ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీలోనూ మున్సిపల్ ఉప ఎన్నికలలో పోటీ చేసే కనీస మెజారిటీ కూడా కూటమి పార్టీలకు లేదు. డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్స్, వైస్ ఛైర్‌పర్సన్స్ ఎన్నికల్లో కనీస మెజారిటీ లేకుండా మీ అభ్యర్ధులను ఎలా పోటీకి నిలబెట్టారు? అధికారం ఉందని దౌర్జన్యంతో వైయస్‌ఆర్సీపీ నుంచి గెలిచిన వారిని మీకు అనుకూలంగా ఓటెయ్యమని బెదరించడం, ప్రలోభపెట్టడంతో పాటు, దాడులకూ తెగబడ్డారు.
తిరుపతిలో వైయస్‌ఆర్ సీపీ కార్పోరేటర్లు బస్సులో వెడుతుంటే, పట్టపగలు నడిరోడ్డుపై దాడిచేయడం అత్యంత దారుణం. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? చంద్రబాబు చేయిస్తున్న వికృత చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ పరిణామాలపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలి. చంద్రబాబు దుర్మార్గాలపై తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.