డిజిటల్ తరగతి గదుల మధ్య విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్న విద్యార్థులకు పచ్చదనాన్ని పరిచయం చేయాలని కృష్ణా జిల్లా అధికారులు నిర్ణయించారు. ఆ బాధ్యతలను జిల్లా వ్యవసాయ అధికారులకు అప్పగించారు. వారానికోసారి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను పొలంబాట పట్టిస్తున్నారు. రెండు వారాల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ‘అగ్రి కనెక్ట్’ అని నామకరణం చేశారు.జిల్లాలోని రైతులకు వ్యవసాయ పద్ధతులు, అనుసరించాల్సిన విధానాలు, సస్యరక్షణ చర్యలను వివరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతులను పొలాల వద్దకు తీసుకెళ్లి అధికారులు ఈ విధానాలను వివరిస్తున్నారు.
కొత్తగా అమలు చేసిన ‘అగ్రి కనెక్ట్’ కార్యక్రమాన్ని ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి అనుసంధానం చేశారు. పిల్లలు తరగతి గదుల్లో ఉన్నప్పుడే భూసంరక్షణ, ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచాలని కలెక్టర్ లక్ష్మీశ భావించారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను వారానికోసారి పొలంబాట పట్టించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అన్ని మండలాల్లోని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు పాఠశాలల విద్యార్థులను ఆయా ప్రాంతాల్లో జరిగే పొలం పిలుస్తోంది కార్యక్రమానికి తీసుకెళ్తున్నారు. వ్యవసాయంలో ఉన్న విధానాలు, ఏకపంట, బహుళ పంటల విధానాలు, సేంద్రీయ ఎరువుల ఉపయోగం, భూసార పరీక్షలు వంటి అంశాలను వివరిస్తున్నారు. నేలకు సారం ఎలా అందుతుంది, దాన్ని పెంపొందించడానికి అవలంబించాల్సిన విధానాలను ఉదాహరణలతో చెబుతున్నారు.