బెజవాడ మెట్రోరైల్ ప్రాజెక్టులో ప్రధానమైన మెట్రో స్టేషన్‌ను బహుళ రవాణా విధానం (మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్)కు వీలుగా అభివృద్ధి చేయాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండేలా ఇంటర్నేషనల్ సంస్థకే దీని డిజైన్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. పీఎన్‌బీఎస్ దగ్గర పెనమలూరు సెంటర్ నుంచి బందరు రోడ్డు మీదుగా వచ్చే కారిడార్-2తో పాటు గన్నవరం నుంచి ఎన్‌హెచ్-16 మీదుగా రామవరప్పాడు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్.. పీఎన్‌బీఎస్‌కు వచ్చే కారిడార్-1, అలాగే భవిష్యత్తులో పీఎన్‌బీఎస్ నుంచి అమరావతిలోని లింగాయపాలెం వరకు కారిడార్-3, జక్కంపూడి నుంచి పీఎన్‌బీఎస్ వరకు కారిడార్-4 కూడా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ దగ్గరే అనుసంధానమవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పీఎన్‌బీఎస్ దగ్గర మల్టీమోడల్ మెట్రో స్టేషన్‌ను నిర్మించాలని ఏపీఎంఆర్‌సీ అధికారులు భావిస్తున్నారు.మెట్రోస్టేషన్‌తో పాటు ఆర్టీసీ బస్సులు, సాధారణ రైళ్లకు కూడా ప్రయాణికులు చేరుకునేలా ప్లాన్ రూపొందించాలన్నది ఏపీఏఎంఆర్‌సీ అధికారుల ఆలోచన. పీఎన్‌బీఎస్ ఎదుట ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలంతో పాటు పక్కనే రైల్వేట్రాక్స్ అవతల రైల్వే స్థలం కూడా ఉంది. ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఎలివేటెడ్ మల్టీమోడల్ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నది అధికారుల అభిప్రాయం. దీనివల్ల మెట్రో రైళ్లలో దిగినవారంతా నేరుగా పీఎన్‌బీఎస్‌లోకి, అలాగే రైల్వేస్టేషన్‌కు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే, రైల్వేస్టేషన్, బస్టాండ్లకు వచ్చినవారు కూడా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఈ మల్టీమోడల్ స్టేషన్‌కు సంబంధించి విధాన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి డిజైన్లకు శ్రీకారం చుడతారు.