రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటలకు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించుకునేందుకు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఈసందర్భంగా చేసిన ఏర్పాట్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ హర్షవర్థన్‌రాజు, ఇంచార్జ్ సీవీఎస్వో మణికంఠ, వివిధ విభాగాల అధికారులతో కలిసి ఈవో సోమవారం పరిశీలించారు. తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేశామంటూ, భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఈవో మీడియాకు తెలిపారు.
గతేడాది కంటే రెండు రెట్లు అధికంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. మెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘాతో కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. దీనికి తగినట్టు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీల్లో అన్నప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను ఈవో, ఇతర అధికారులు తనిఖీ చేశారు. కొంతమంది భక్తులతో నేరుగా మాట్లాడారు.అలానే.... ఈవో శ్యామలరావు అలిపిరి కాలినడకమార్గంలోని మోకాళ్లమిట్ట వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మరుగుదొడ్లను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు. అంతకు ముందు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలోనూ ఈవో తనిఖీలు చేశారు. అన్నప్రసాదాల నాణ్యతపై భక్తులతో నేరుగా మాట్లాడారు. తాను కూడా భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు.