దాదాపు 80 వరకు కేసులున్న ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని పోలీసులు ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రభాకర్ పలు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. అతడి లైఫ్ స్టైల్ చూస్తే... వీడు దొంగా, లేక సెలబ్రిటీనా అనిపిస్తుంది. ఇంట్లో వండిన భోజనం తప్ప బయట తిండి తినడు. ప్రత్యేకంగా వంట మనిషికి నెలకు రూ.10 వేలు చెల్లిస్తుంటాడు. ఫిట్ నెస్ కోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్, తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం ఎక్సర్ సైజులు చేస్తాడు. ఎప్పుడైనా పబ్, రెస్టారెంట్ కు వెళితే వేలల్లో టిప్పులు ఇస్తుంటాడు. ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లలో తప్ప మామూలు కార్లలో తిరగడు. ఇతర పేర్లతో ఐదు విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. అతడి వైవాహిక జీవితం చూస్తే... పెళ్లయింది కానీ భార్యతో ఉండడు. మరో రాష్ట్రానికి చెందిన అమ్మాయితో కలిసి గచ్చిబౌలిలోని ఫ్లాట్ లో ఉంటున్నాడు. ఇక వేశ్యల వద్దకు వెళ్లినప్పుడు వారికి అధిక డబ్బు ఆశ చూపి వారి పేరు మీద సిమ్ కార్డులు కొనుగోలు తీసుకునేవాడట.తనకు ఏపీలో చేపల చెరువులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని స్నేహితులకు చెబుతుంటాడు. రక్షణ కోసం అని చెప్పి బీహార్ నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేసి 3 తుపాకులు తెప్పించుకున్న ప్రభాకర్... ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తుపాకీ కాల్చడం ప్రాక్టీస్ చేశాడు. గురి తప్పకుండా కాల్చడం నేర్చుకునే క్రమంలో ఓ కుక్కను కూడా కాల్చి చంపాడు. ఇక, పోలీసులు అతడి ఫ్లాట్ నుంచి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తన లక్ష్యాలను రాసుకున్నట్టు గుర్తించారు. ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ గోవాలో ఓ హోటల్ కట్టాలన్నది అతడి కోరిక. వివిధ ప్రాంతాల్లో ఊరి బయట ఉంటే ఇంజినీరింగ్ కాలేజీల్లో చోరీలు చేయడం అతడి స్పెషాలిటీ. ప్రభాకర్ లైఫ్ స్టైల్ ఇలా ఉంటే... స్వగ్రామంలో అతడి తండ్రి భిక్షాటన చేసి బతుకుతున్నాడు. రేషన్ బియ్యం, పెన్షన్, భిక్షాటనతో వచ్చే సొమ్మే ఆయనకు జీవనాధారం.