ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఆసీస్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఊహించని రీతిలో షాక్‌లు ఎదురయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన స్క్వాడ్ నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లు దూరమయ్యారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు జోష్ హేజెల్‌వుడ్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు ఆసీస్ సెలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. జనవరి 13న ప్రకటించిన ఆసీస్ స్క్వాడ్‌లో ఇప్పటికే నలుగురు బయటకు వెళ్లడంతో, ఫిబ్రవరి 12న తమ తుది జట్టును ప్రకటించనున్నట్లు ఆసీస్ బోర్డు వెల్లడించింది.
ఐసీసీ వరల్డ్‌కప్-2023 హీరోలే స్క్వాడ్ నుంచి దూరం కావడం ఆసీస్‌ను కలవరపెడుతోంది. తొలుత జనవరి 31న వెన్నెముక గాయంతో మిచ్ మార్ష్ దూరమవగా, అనూహ్య రీతిలో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినీస్ తాజాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
పాట్ కమిన్స్, హేజేల్‌వుడ్ ఇద్దరూ గాయాల కారణంగా జట్టుకు దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్‌తో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆరంభంలో హేజేల్‌వుడ్, సిరీస్ అనంతరం కమిన్స్ గాయాలపాలయ్యారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కూడా వీళ్లిద్దర్నీ దూరం పెట్టినా గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు దాదాపు దూరమైనట్లే. సౌతాఫ్రికాతో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌కి కమ్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జార్జ్ బెయిలీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
ఆసీస్ జట్టులోని టాప్ 3 పేస్ బౌలర్లలో ఇద్దరైన కమిన్స్, హేజేల్‌వుడ్ దూరం కావడంతో వారి స్థానం భర్తీ చేయడం ఆసీస్ క్రికెట్ బోర్డుకు సవాలుగా మారింది. మార్ష్ స్థానంలో ఫ్రేజర్ మెక్ గుర్క్‌ని ఆడించే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ స్టాయినీస్ స్థానంలో కూపర్ కాన్లీ పేరును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.