శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ రనీల్ విక్రమసింఘే తన సతీమణి ప్రొఫెసర్ మైత్రి విక్రమసింఘేతో కలిసి ఆదివారం ఉదయం సుప్రభాతసేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాని దంపతులకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తులాభారం మొక్కు చెల్లింపు : ఈ సందర్భంగా పడికావలి వద్ద శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్ విక్రమసింఘే తులాభారం మొక్కు చెల్లించారు. తులాభారం మొక్కు తిరుమలలో ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా భక్తులు తూకం వేసి తమ బరువుకు సమానంగా చక్కెర, బియ్యం, బెల్లం లేదా చిల్లర నాణేలను స్వామివారికి కానుకగా చెల్లిస్తారు. గౌ|| శ్రీలంక ప్రధాని చిల్లర నాణేలతో తులాభారం వేశారు. కిలో రూ.202/- చొప్పున తన బరువుకు సమానమైన చిల్లర నాణేల కోసం భారతీయ కరెన్సీ రూ.16,160/- చెల్లించారు.
వేదాశీర్వచనం : గౌ|| శ్రీలంక ప్రధాని దంపతులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత టిటిడి ఈవో, జెఈవో కలిసి పట్టువస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.