టీడీపీ, వైసీపీ మధ్య ఐటీ గ్రిడ్ తారాస్థాయికి చేరింది. ఇదంతా తమ వ్యక్తిగతమని.. పార్టీకు సంబంధించిన అంశమంటూ టీడీపీ వాదిస్తోంది. ఓటర్ల జాబితాను ఎలా సొంతగా చేజిక్కించుకుంటారంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ వ్యవహారంలో కీలకమైన ఐటీ గ్రిడ్ అధినేత అశోక్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు హైకోర్టు కూడా పోలీసుల దర్యాప్తులో తాము జోక్యం కలగజేసుకోమంటూ హెబియస్ కార్బస్ పిటీషన్ కొట్టేసింది. దీంతో ఏపీ, తెలంగాణలో రసవత్తరమైన వాతావరణం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ.. వైసీపీ సానుభూతి ఓట్లను తొలగిస్తుందంటూ ఆ పార్టీ నేతలు కొద్దికాలంగా ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూడా తన ఓటును తన ప్రమేయం లేకుండా ఫామ్ నెంబరు 7 ద్వారా తొలగించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో సుమారు 75000 వరకూ ఇటువంటి ఫిర్యాదులు అందినట్లు ఎన్నికల సంఘం చెబుతుంది. గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో మరింత దిగజారి ఓట్లను తొలగిస్తున్నట్లు ప్రత్యక్షంగా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మాదాపూర్ కేంద్రంగా ఐటీగ్రిడ్ అనే ఐటీ కంపెనీ.. సాగిస్తున్న దందాపై లోకేశ్వర్‌రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తీగలాగిన పోలీసులకు డొంక కనిపించింది. ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ బాబుకు సెగ తగిలినంత పనైంది. ఆగమేఘాల మీద ఇదంతా టీడీపీ ఆస్తి అంటూ.. కార్యకర్తల డేటాను వైసీపీ చోరీ చేస్తుందని.. దీనికి కేసీఆర్, కేటీఆర్ సాయం చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రిటర్న్ గిఫ్టు అంటే తమ పార్టీ సమాచారం చోరీచేసి వైసీపీ నేత జగన్‌కు ఇవ్వటమా! అంటూ దేశం అధినేత చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భాస్కర్ అనే ఉద్యోగి కనిపించట్లేదంటూ హైకోర్టులో హెబియస్ కార్బస్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి ఉద్యోగులను నిర్బంధించలేదని.. వారే అంగీకరించారని చెప్పారు. సేవామిత్ర పేరిట ఏపీలో 3 కోట్ల మంది ప్రభుత్వ పథకాల లబ్దిదారుల డేటా ఉండటంపై పోలీసులు నిరభ్యంతరంగా దర్యాప్తు చేయవచ్చని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్.. ఇది తెలంగాణలో జరిగిన ఘటన కావటం వల్ల ఇక్కడ నుంచే దర్యాప్తు చేస్తామంటూ స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం సహాయం లేకుండా లబ్దిదారుల సమాచారం సేకరించటం చాలా కష్టమనే అనుమానం వ్యక్తంచేశారు. చట్టపరిధిలో తాము ముందుగా నోటీసులు ఇచ్చామని.. మూడురోజులుగా దానికి స్పందించకపోవటంతో విచారణ కోసమే ఉద్యోగులను రప్పించామని వివరించారు. తెలంగాణలో జరిగిన ఘటనను ఏపీ వెళ్లి ఎలా విచారణ చేస్తామని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘానికి, ఆధార్ సంస్థకు కూడా లేఖలు రాశామని చెప్పారు. వరుస పరిణామాలతో ఉలికిపాటుకు గురైన టీడీపీ దీన్నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఉన్న అనువైన మార్గాల అన్వేషిస్తోందని సమాచారం. న్యాయపరమైన అంశాలను వెతికేపనిలో నిమగ్నమైంది. ఐటీ మంత్రిగా ఐటీ గ్రిడ్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడటం.. టీడీపీ ఎదుటున్న సవాల్. ఇదంతా అన్యాయమంటూ టీడీపీ శ్రేణులు గొంతు చించుకున్నా.. ఇది అధికార దుర్వినియోగం కిందకే వస్తుందంటూ న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎన్నికల వేళ ఇటువంటి సున్నితమైన అంశాలు ప్రజల బావోద్వేగాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటమే టీడీపీ ఉలికిపాటుకు కారణం అనేది విశ్లేషకుల అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa