హాస్పిటాలిటీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఓయో తాజాగా భారీగా లాభాలను నమోదు చేసుకుంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.166 కోట్లు లాభాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. గతేడాది డిసెంబర్‌లో కేవలం రూ. 25 కోట్లు మాత్రమే లాభాలు ఉండగా ఈసారి లాభాల్లో ఏకంగా ఆరు రెట్ల పెరుగుదల కనిపించడం విశేషం. ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్, టూరిస్ట్ ప్రదేశాలను ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించడం వంటి అంశాలు ఓయోకు కలిసొచ్చింది. లాభాల్లో ఆరు రెట్టు పెరుగుదల కనిపించడం విశేషం. దీంతో ఓయో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,695 కోట్లు నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,296 కోట్లతో పోలిస్తే 31% అధికం. ఇక ఓయో EBITDA (వడ్డీ, పన్ను, దిగుబడి ఖర్చులు పోయిన తర్వాత వ్యాపార లాభం) రూ. 249 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది కేవలం రూ. 205 కోట్లు మాత్రమే ఉంది. ఈసారి ఏకంగా 22 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే ఓలా స్థూల బుకింగ్ విలువ రూ. 3,341 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది కేవలం రూ. 2,510 కోట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏకంగా 33 శాతం వృద్ధి సాధించింది.
కాగా ప్రస్తుతం ఆర్థిక ఏడాది 2024-25లో గడిచిన 9 నెలలు (ఏప్రిల్- డిసెంబర్) వరకు ఓయో మొత్తం లాభం రూ.457 కోట్లుగా నమోదైందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో కంపెనీ రూ.111 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఓయో భారత్‌తోపాటు అమెరికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాల్లో మెరుగైన వృద్ధిని చూపింది. ముఖ్యంగా భారత మార్కెట్లో ప్రీమియం సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, అమెరికా హోటల్ కంపెనీ G6 హాస్పిటాలిటీ, చెక్‌మైగెస్ట్‌ను కొనుగోలు చేయడం కంపెనీ లాభాలను పెంచింది.
ఇదిలా ఉంటే గతకొన్ని రోజుల క్రితం ఓయో కొత్త చెక్ ఇన్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధన ప్రకారం హెటల్స్‌లో పెళ్లి కాని జంటలకు గదులు ఇవ్వరు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఈ విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా హోటల్స్‌కు వచ్చే జంటలు తమ బంధానికి సంబంధించిన ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో చేసుకునే బుకింగ్స్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.