ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని, సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల సమాచారం. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు. ఆకలిదప్పులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ కదలడంలేదని, ప్రయాగ్ రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు. యూపీ సర్కారు వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ... దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం విఫలమైందనే దానికి ఈ ట్రాఫిక్ జామే కారణమని అఖిలేశ్ చెప్పుకొచ్చారు. ప్రతిచోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్, డీజిల్ వంటివి అందటంలేదని, ఆహారం, విశ్రాంతి లేక భక్తులు నీరసించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.