సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్టు చేయడంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహిళల అరెస్టు నిబంధనలను మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.రాత్రి సమయంలో మహిళలను అరెస్టు చేయకూడదనే నియమం కేవలం మార్గదర్శకం మాత్రమేనని, అది తప్పనిసరి కాదని హైకోర్టు పేర్కొంది. పోలీసులు కోరుకుంటే ఈ నియమాన్ని ఉల్లంఘించవచ్చని హైకోర్టు తెలిపింది.ఈ నిబంధన వెనుక మంచి కారణం ఉందని జస్టిస్ జి ఆర్ స్వామినాథన్, జస్టిస్ ఎం జోతిరామన్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అరెస్టు చేసే అధికారులకు ఇది ఒక హెచ్చరిక అన్నారు. పోలీసులు ఈ నియమాన్ని పాటించకపోతే, అరెస్టు చట్టవిరుద్ధం కాదన్నారు. కానీ ఆ అధికారి ఆ నియమాన్ని ఎందుకు పాటించలేకపోయాడో కారణాలను చెప్పాల్సి ఉంటుందన్నారు.నియమంలో రెండు విషయాలు చెప్పారు. మొదటిది, ప్రత్యేక సందర్భాలలో తప్ప, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మహిళలను అరెస్టు చేయకూడదని ధర్మాసనం పేర్కొంది. రెండవది, ప్రత్యేక సందర్భాలలో కూడా, ముందుగా స్థానిక మేజిస్ట్రేట్ నుండి అనుమతి తీసుకోవాలి. నిర్దిష్ట కేసు ఏమిటో నియమం పేర్కొనలేదు. సల్మా వర్సెస్ స్టేట్ కేసులో, కోర్టు న్యాయమూర్తి మహిళల అరెస్టుకు మార్గదర్శకాలను రూపొందించారని హైకోర్టు పేర్కొంది.
ధర్మాసనం న్యాయమూర్తులు, ఈ మార్గదర్శకాలు నియమాల భాషను పునరుద్ఘాటిస్తున్నాయని అని అన్నారు. ఇవి పోలీసుల సమస్యలకు పరిష్కారం చూపవన్నారు. మార్గదర్శకాలను జారీ చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ మార్గదర్శకాలు ప్రత్యేక కేసులు ఏమిటో స్పష్టంగా పేర్కొనాలి. అవసరమైతే BNS సెక్షన్ 43కి కూడా మార్పులు చేయవచ్చని ఈ మేరకు భారత లా కమిషన్ తన 154వ నివేదికలో సూచించినట్లు పేర్కొన్నారు.సూర్యాస్తమయం తర్వాత ఒక మహిళను అరెస్టు చేసినందుకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనిత, హెడ్ కానిస్టేబుల్ కృష్ణవేణిపై చర్య తీసుకోవాలనే ఉత్తర్వును కోర్టు రద్దు చేసింది. కానీ సబ్-ఇన్‌స్పెక్టర్ దీపపై ఉన్న ఉత్తర్వును రద్దు చేయడానికి కోర్టు నిరాకరించింది. కోర్టు ముందు తప్పుడు సమాచారం ఇచ్చారని దీపపై ఆరోపణలు వచ్చాయి.ఒక మహిళా నేరస్థురాలిని రాత్రిపూట పట్టుకోవాల్సి వస్తే, పోలీసులు ఏం చేస్తారు? ఒక ఆడ దొంగ రాత్రిపూట మాత్రమే దొంగతనం చేస్తుందనుకుందాం. పోలీసులు ఆమె కోసం ఉదయం వరకు వేచి ఉంటారా? అలాంటప్పుడు, ఆమె పారిపోతుంది! అందువల్ల ఈ నియమం కేవలం మార్గదర్శకం మాత్రమే అని కోర్టు పేర్కొంది. ప్రతిసారీ దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదన్నారు.
కానీ పోలీసులు దీనిని తప్పుగా ఉపయోగించుకోకూడదని ధర్మాసనం పేర్కొంది. ఎటువంటి కారణం లేకుండా ఏ స్త్రీని రాత్రిపూట అరెస్టు చేయకూడదన్న కోర్టు, పోలీసులు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. తద్వారా పోలీసులు ఎప్పుడు నిబంధనలను ఉల్లంఘించవచ్చో, ఎప్పుడు ఉల్లంఘించకూడదో తెలుస్తుందన్నారు. మహిళల భద్రతకు, పోలీసుల బాధ్యతకు మధ్య సమతుల్యతను సాధించే ప్రయత్నం ఈ నిర్ణయం. తర్వాత ఏమి జరుగుతుందో, పోలీసు శాఖ కొత్త మార్గదర్శకాలను ఎలా రూపొందిస్తారో వేచి చూడాల్సిందే..!
![]() |
![]() |