దేశరాజధానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ కాలుష్యం అంతా ఇంతా కాదు. దేశంలో ఏనగరంలోనూ లేనంత కాలుష్యం ఢిల్లీకి సొంతం. అందుకే అక్కడ అనేక నిబంధనలు అమలులో ఉంటాయి. కోర్టులు, ఎన్జీసీ ఆదేశాలతో సరిబేసి సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించాల్సి వచ్చింది. దీపావళి వచ్చిందంటే అక్కడి కాలుష్యం అంతా ఇంతా కాదు.
సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి వస్తే సకల అనారోగ్యాలకు గురవడం ఖాయం. అలాంటి ఢిల్లీకి అంతర్జాతీయంగా రికార్డులు దక్కాయి. గాలిలో 2.5 మైక్రోమీటర్ల వ్యాసార్థం గల కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాలను హానికరంగా పరిగణిస్తారు. శీతాకాలంలో ఇది మరీ ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం ఢిల్లీ ఈ మార్కుని కూడా దాటిపోయింది.
కాలుష్య రాజధానుల జాబితాలో మన దేశరాజధాని నగరం ఢిల్లీ అగ్రభాగాన నిలిచింది. అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మాత్రం 11వ స్థానంలో నిలిచింది. ఇందులో గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంది.2018లో ప్రజా పర్యవేక్షణ సంస్థల నుంచి సేకరించిన డేటా ఆధారంగా గ్రీన్‌పీస్ సంస్థ కాలుష్య నగరాల జాబితాను రూపొందించింది.
గ్రీన్ పీస్ సంస్థ నివేదిక ప్రకారం.. ఢిల్లీ నగరంలో గాలిలో దుమ్ము రేణువులు భారీగా ఉన్నాయి. ఢిల్లీ తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిలిచింది. ఢాకా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మూడో స్థానంలో నిలిచింది. గురుగ్రామ్ తర్వాతి స్థానాల్లో ఘజియాబాద్, ఫరీదాబాద్, భీవండి, నోయిడా నగరాలు ఉన్నాయి.
నిజానికి వాయు కాలుష్యం వలన చిన్న పిల్లల మానసిక ఎదుగుదలకు విఘాతం కలుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. రహదారులపై పేరుకు పోయిన చెత్త, దుమ్ము, ధూళి, నిర్మాణాలు, వాహనాలు, ఇంధన వినియోగం, ఎసిలు, ఫ్రిడ్జ్‌లు భారీ పరిశ్రమలు ఈ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు.
అయితే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, రాష్ట్రాలలో పంట మిగులును తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కాలుష్యం విషయంలో ఢిల్లీ ఒక గుణపాఠం. అలాగే దేశంలోని ముంబయి, కోల్‌కొతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనూ కాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa