రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలవడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు నాయకులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైకాపాలు ఇప్పటికే కొన్ని చోట్ల అనధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనలో అధికార తెలుగుదేశం ముందంజలో ఉంది. పలు జిల్లాల్లో పలువురు సిట్టింగ్‌లకు సీట్లు కట్టబెడుతూ..అనధికారికంగా చెబుతోంది. సిట్టింగ్‌ల్లో ఎటువంటి వివాదాలు లేనివారు, గెలుస్తారనే నమ్మకం ఉన్నవారి విషయంలో అధినేత చంద్రబాబు వారిని ప్రచారం చేసుకోమని చెబుతున్నారు. కాగా కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి సీనియర్ నేతలు…తమ వారసులను రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నవారిలో సీనియర్లు అయిన వారు వారసులను ఎన్నికల బరిలోకి దించుతున్నారు.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నాయకుల్లో కొందరు అనారోగ్యంతో, కొందరు రాజకీయాలపై ఆసక్తిలేక మరి కొందరు..వయస్సు ప్రభావంతో..ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికలకు దూరంగా ఉంటూ..తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పలువురు సీనియర్లు తమ వారసుల కోసం పక్కకు తప్పుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టిడిపి సీనియర్ నేత అయిన ఎర్రంనాయుడు మృతితో ఆయన కుమారుడు ఇప్పటికే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. దీంతో ‘ఎర్రం’ వారసుడు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ‘అశోక్‌గజపతిరాజు’ మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నా..ఆయన కుమార్తె రంగంలోకి వస్తుందంటున్నారు. కాకినాడ ఎంపి ‘తోట నర్సింహ్మం’ తన వారసురాలిగా తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. రాజమండ్రి ఎంపి మురళీమోహన్ తాను పోటీ చేయనని చెబుతున్నారు. ఆయన కోడలు పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతున్నా..అదెంత వరకు నిజం అవుతుందో తెలియదు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ తన కుమారునికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు అంగీకరించే పరిస్థితి లేదు. నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు తన కుమారుడుకు ఎమ్మెల్యే కానీ, ఎంపి సీటు కానీ ఇవ్వాలని కోరుతున్నారు. ‘చంద్రబాబు’ మాత్రం ‘రాయపాటి’నే పోటీ చేయమని చెబుతున్నారు. ఒకవేళ ఆయన పోటీకి నిరాకరిస్తే…కుమారుడు ‘రంగారావు’ పోటీ చేయవచ్చు. అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి తాను పోటీ చేయనని తన కుమారుడు ‘పవన్‌రెడ్డి’కి సీటు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు దీనికి అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు ఎంపి కూడా అనారోగ్య కారణాలతో తన వారసులకు సీటు ఇవ్వాలంటున్నారు. పార్లమెంట్ సభ్యుల్లో చాలా మంది..వివిధ కారణాలతో తమ వారసులను ఎన్నికల్లో దించుతుండగా..పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రంగంలోకి తెస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో ‘పలాస’ ఎమ్మెల్యే జి.ఎస్.ఎస్.శివాజీ తన కుమార్తెకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర ఎమ్మెల్యే నారాయణస్వామినాయుడుకు వృద్ధాప్యరీత్యా సీటు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో..ఇక్కడ ఆయన వారసులు సీటు కోరుతున్నారు. రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి ‘గంటా శ్రీనివాసరావు’ తనకు, తన కుమారుడికి సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. చంద్రబాబు ‘గంటా’కు మాత్రమే సీటు ఇచ్చే పరిస్థితి ఉంది. విశాఖలో మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ..ఆయనపై ఉన్న ఆరోపణల దృష్ట్యా ఆయనకు సీటు రావడం కష్టమే. కృష్ణా జిల్లా ‘పెడన’ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనారోగ్య కారణాలతో తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన కుమార్తెకు సీటు ఇవ్వాలని కోరడంతో చంద్రబాబు అంగీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa