ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్య‌క‌ర్త‌ల‌ని అభ్య‌ర్ధుల‌ను చేయండి...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 06:36 PM

రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో స్థానికంగా ఎంతో మంది కార్యకర్తలు పనిచేస్తున్నారని, ఆర్థిక పరంగా వారు ఎదగకపోయినా, పార్టీపట్ల విధేయత, ఇతర నాయకుల పట్ల కృతజ్ఞతాభావంతో పనిచేస్తున్నారని, అటువంటి మనస్తత్వం ఉన్నవారిని ఎంపిక చేయగలిగితే కులపరమైన వ్యతిరేకత రాదని స్థానిక సంస్థల ప్రతినిధులు, నాయకులు అభిప్రాయపడు తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో స్థానికులైన ముగ్గురు కార్యకర్తల పేర్లను తెరపైకి తెచ్చారు. ఇప్పటికీ పోటీ చేసే అవకాశం ఇచ్చినా..ఆర్థికభారం తామంతా కలసి భరిస్తామని ముఖ్య నాయకులందరూ పార్టీ ముఖ్యుల దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో రెండు సార్లు ఓడిపోయిన ‘వీరయ్య’కు అవకాశం ఇవ్వాలని స్థానిక నేతలు పట్టుపడుతున్నారు. ఇదే విషయంలో ఎంపి గల్లా జయదేవ్‌, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కూడా వీరయ్య వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఎన్నో ఏళ్ల నుంచి కలసి మెలసి పనిచేస్తున్నాం..ఆయన భవిష్యత్‌లో ‘నక్కా’ వలే ఉంటారని, రావెల, శ్రావణ్‌ వలే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారెవరికీ అవకాశం ఇవ్వవద్దని, ఆల్‌ఇండియా అధికారులెవరికీ అవకాశాలు ఇవ్వవద్దని స్థానిక నాయకులు పార్టీ ముఖ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల కార్యకర్తల్లో మీ ఇష్టం వచ్చిన వారిని ఎంపిక చేయండి. తామంతా ఖర్చులు భరిస్తామని, పార్టీ పరంగా ఆర్థికంగా కొంత వరకు ఆదుకోవాలి, ఎంపి అభ్యర్థి కూడా ఖర్చు భరించాలి. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు అయిన వారు స్వంత సొమ్మును ఎంత ఖర్చుపెట్టారు. కొవ్వూరులో స్థానిక అభ్యర్థిని ఎంపిక చేస్తే ఐదు కోట్లు తెస్తామని, ఆ సొమ్మును చూపిస్తామని స్థానికులు ముఖ్యనేతలకు చెప్పడం జరిగింది. అదే విధంగా పత్తిపాడు,తాడికొండ, చింతలపూడి ఇతర నియోజకవర్గాల్లో ఇదే నినాదం తెరపైకి రాబోతోంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ..ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారో ఆయా నియోజకవర్గాల్లో కులపరమైన పోరాటాలు జరుగుతున్నాయని, అటువంటిది మళ్లీ జరగకుండా ఉండాలంటే..ఎప్పటినుంచో పార్టీలో పనిచేసేవారికే టిక్కెట్లు ఇవ్వాలని స్థానిక నేతలు కోరుతున్నారు. స్థానిక కార్యకర్తలకు అవకాశం ఇస్తే..అది స్ఫూర్తిగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఆల్‌ ఇండియా సర్వీసులకు చెందిన అధికారులకు కానీ, రిటైర్‌ ఉద్యోగులకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని ‘చంద్రబాబు’ చెబితే ఇంత వరకు జరిగిన సంఘటనలు భవిష్యత్‌లో జరిగే అవకాశం ఉండదని, తటస్త అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. పార్టీనేత ‘చంద్రబాబు’ ఆ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంటారా..? తీసుకుని సామాన్య దళిత కార్యకర్తలకు పోటీ చేసే అవకాశంఇచ్చి ఇతర పార్టీ నేతలకు ఆదర్శంగా నిలుస్తారా..?వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa