ఆయనకు సుధీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. కీ.శే. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, మైసూరారెడ్డి, చంద్రబాబునాయుడు,కరణం బలరాం వంటి ఉద్దండులతో పనిచేసిన అనుభవం ఆయనది. ఒకప్పుడు…కడప జిల్లాల్లో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా కనిపించిన నేత. అటువంటి నేత..ఇప్పుడు..తనకు సీటు ఇవ్వమని, తనను వాడుకోమని, తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని నాలుగు చోట్ల గెలిపిస్తానని చెప్పుకుంటూ..సీటు కోసం పార్టీల గడపలు తొక్కుతున్నాడు. ఈవిషయాన్ని ఆయనే బహిరంగంగా చెప్పారు. ఆయన వినతిని ప్రధాన పార్టీలు పట్టించుకోక పోవడంతో..ఇతరపార్టీల వైపు చూడాల్సిన పరిస్థితి ఆయనది. ఇంతకీ ఆ వెటరన్ రాజకీయ నేత ఎవరుకుంటు న్నారా..? ఆయన ఎవరో కాదు..మాజీ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి.
ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన చరిత్ర డి.ఎల్.రవీంద్రారెడ్డి. జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పలు కీలకశాఖలకు మంత్రులుగా పనిచేసి సమర్థుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి ఆయన ఇప్పుడు టిక్కెట్ కోసం పార్టీల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. మొన్న మొన్నటి దాకా…ఆయన టిడిపిలోకి రావడం లాంఛనమేనని అందరూ భావించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కూడా ఆయన రాక కోసం ఎదురు చూశారు. ముఖ్యంగా మంత్రి లోకేష్ ఆయన కోసం ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పట్లో..సరైన సమయంలో చేరదామని ‘డిఎల్’ వేచి చూశారు. అదే ఆయన కొంపముంచింది. తన ప్రత్యర్థి అయిన ‘సుధాకర్‌యాదవ్’కు టిటిడి ఛైర్మన్ పదవి దక్కడంతో..ఇక మైదుకూరు సీటు తనకేనని ‘డిఎల్’ భావించారు. అయితే అనూహ్యంగా…తెలంగాణకు చెందిన మంత్రి శ్రీనివాస్‌యాదవ్ ఆంధ్రాలో పర్యటించి…’యాదవ్’లను చైతన్యం చేస్తానని, బీసీలకు నాయకత్వం వహిస్తానని, చంద్రబాబు బీసీలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తడంతో ఒక్కసారిగా మైదుకూరులో పరిస్థితి మారిపోయింది. ‘యాదవ్’ సామాజికవర్గానికి అన్యాయం చేస్తున్నారన్న ‘తలసాని’ విమర్శలతో ‘చంద్రబాబు’ వెనుకా ముందు ఆలోచించకుండా ‘మైదుకూరు’ సీటు ‘పుట్టా’కు కేటాయించారు. దీంతో..’డిఎల్’పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. టిడిపిలో చేరదామని అప్పట్లో ‘చంద్రబాబు’ను కలిసిన ఆయనకు ఇప్పుడు సీటు లేదనే సరికి..ఉక్రోశం పొంగుకు వచ్చింది. తనకు అన్యాయం చేసిన ‘టిడిపి’ని గోతిలో పాతిపెడతానని రంకెలేస్తున్నారు. తననువాడుకోమని పరోక్షంగా వైకాపాకు సిగ్నల్స్ ఇస్తున్నా, అభ్యర్థిస్తున్నా..అక్కడ నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. దీంతో..ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ‘పుట్టా’ను ఓడించడానికి ‘జనసేన’,బిజెపి లేక స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే ఆయన స్నేహితుడు మాజీ మంత్రి ‘ఆనం రామనారాయణరెడ్డి’ ఆయనను వైకాపాలో చేర్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ‘ఆనం’ ప్రయత్నాలు సఫలమై ‘డిపల్’ వైకాపాలో చేరితే..జిల్లాలో ‘టిడిపి’కి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa