ముఖ్యమంత్రిగా పాలనలో తన అరాచకాలను ఆపకపోతే నియంతలు ముస్సోలినీ, గడాఫీలకు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనను గాలికి వదిలి అధికార దుర్వినియోగంతో దౌర్జన్యాలు, దాడులతో సమాజంలో భయాందోళనలు పెంచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలే ఊపిరిగా చంద్రబాబు పాలన సాగుతోందని అన్నారు. ఆయన మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
అతి తక్కువ కాలంలోనే ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే లేదు. అందుకే సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని కేసులతో ఈ ప్రభుత్వం వేధిస్తున్నది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ప్రజలెవరూ ప్రశాంతంగా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఒక్కొక్కరిపై పదేసి కేసులు పెట్టి ఇప్పటికే వంద మందికి పైగా సోషల్ మీడియా యాక్టివీస్ట్ లను వేధిస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీలతో చావబాదిన ఘటనలున్నాయి. పెంచడానికి, ముంచడానికి, చంపడానికే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్టుంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా విద్యుత్ చార్జీలు, మద్యం ధరలు పెంచాడు. మిర్చి, ధాన్యంకి గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతులను ముంచేశాడు. పబ్లిసిటీ పిచ్చితో తిరుపతి తొక్కిసలాటలో భక్తుల మరణానికి కారణమయ్యాడు అని మండిపడ్డారు.
![]() |
![]() |