ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలకు తావులేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజల ఎదురుచూపులు త్వరలో నెరవేరుతాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ దుర్మార్గాలు, అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. తప్పు చేసిన వారు కూటమి ప్రభుత్వంలో తప్పించుకోలేరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు నేడు ఫలించాయని, దుర్మార్గుడు వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారంటూ సంచలన కామెంట్లు చేశారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని నేరాలు చెయ్యడం వైసీపీ మూర్ఖత్వానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి దృశ్యాలను ప్రజలందరూ కల్లారా చూశారని తెలిపారు. అయినా సిగ్గు లేకుండా సినిమాల్లో మాదిరి బాధితుడిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. అరాచక వాదులపై సత్వర చర్యలు తీసుకోవడం అభినందనీయమని పోలీసులను కొనియాడారు. చట్ట ప్రకారమే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. అన్యాయాలు చేసిన వారిపై ఆధారాలతోనే పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో గుడివాడ మట్టిదోపిడి, భూముల ఆక్రమణ వంటి అంశాలపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. గుడివాడ అరాచకాలు, అవినీతిపై త్వరలోనే చర్యలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే రాము చెప్పుకొచ్చారు.
![]() |
![]() |