విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నది. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రాథమికంగా 99.75 ఎకరాలు అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూమి 90.75 ఎకరాలు ఉండగా, మరో తొమ్మిది ఎకరాలు ప్రైవేటు వ్యక్తులది. మెట్రో రైలు ప్రాజెక్టుకు గత ఏడాది డిసెంబరులోనే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు భూసేకరణకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రాజెక్టు కోసం తొలి దశలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 47.75 ఎకరాలు, పోర్టుకు చెందిన 36 ఎకరాలు, రైల్వే భూమి నాలుగు ఎకరాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి మూడు ఎకరాలు, ప్రైవేటు భూమి తొమ్మిది ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. సర్వే బాధ్యతను జాతీయ రహదారుల భూసేకరణ విభాగానికి అప్పగించారు. కాగా మెట్రో మొదటి దశ ప్రాజెక్టు 46.75 కి.మీ. పొడవునా నిర్మించనున్నారు. తొలి దశలో స్టీల్‌ప్లాంట్-కొమ్మాది, గురుద్వారా-పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మార్గాల్లో కారిడార్లు నిర్మిస్తారు. స్టీల్‌ప్లాంట్-కొమ్మాది మధ్యన 29 స్టేషన్లు, గురుద్వారా- పాత పోస్టాఫీసు మధ్య ఆరు స్టేషన్లు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మధ్యన ఏడు...మొత్తం 42 స్టేషన్లు ఏర్పాటుచేస్తారు.
![]() |
![]() |