కేంద్రంలోని మోడీ తన నియంతృత్వ పాలనను ఎవరైనా ప్రశ్నిస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులకు ఉసిగొల్పుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌కి న్యాయంగా రావాల్సిన నిధులు, వాటాలు అడిగితే ఐటీ దాడులు చేయిస్తున్నారని దీనికి తాజా ఘటనే నిదర్శనమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శాంతిరాముడు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ అసోసియేషన్ తరఫున ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఆంధ్రప్రదేశ్‌లో ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అమలవుతోందని ‘ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్’ (అపెక్మా) స్పష్టం చేసింది. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే వరకు రాష్ట్రంలోని కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.5వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ చంద్రబాబు చెల్లించారని వారు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం యథావిథిగా ఫీజు రీయింబర్స్ చేస్తున్నారని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. 2018-19 విద్యా సంవత్సరానికిగాను కాలేజీలకు మొదటి క్వార్టర్(3నెలలు) చెల్లింపులన్నీ చేశారని వివరించారు. రెండో క్వార్టర్‌కి సంబంధించిన చెల్లింపులు కూడా కొన్ని కాలేజీలకు జరిగాయని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి ఒకసారి చెల్లించే విధానం ఉండగా.. టీడీపీ ప్రభుత్వం క్వార్టర్ల వారీగా మరింత మెరుగ్గా ఫీజు రీయింబర్స్ చేస్తోందన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.35 వేల నుంచి రూ.45 వేలకు ముఖ్యమంత్రి పెంచారని ఆ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్’ (అపెక్మా) స్పష్టం చేసింది. ఈ ప్రకటన విడుదల చేసిన సరిగ్గా 5 రోజులకు...అపెక్మా అధ్యక్షుడు ఎం శాంతిరాముడుపై ఐటీ దాడులు జరిగాయి. ఈ అంశం తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు చేయాలని, హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసిన ప్రతీ ఒక్క ఏపీ ప్రజాప్రతినిధినీ టార్గెట్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనకు దిగిన ఎంపీ సీఎం రమేష్‌పై ఐటీ దాడులు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంటు వేదికగా ``మిస్టర్ ప్రైమ్ మినిస్టర్`` అంటూ నిలదీసిన ఎంపీ గల్లా జయదేవ్‌కు ఈడీ నోటీసులు పంపారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష కట్టిందని తేటతెల్లమవుతోందని లోకేశ్ చెప్పారు. మోడీని విమర్శిస్తే ఈడీతో దాడులు చేయిస్తున్నారని, ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే..కేసులతో వేధిస్తున్నారని, చివరికి లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలోకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించినా ఓర్వలేక ప్రశంసించిన వారిపై ఐటీ దాడులు చేస్తున్నారని, ఇదేమి న్యాయం అని లోకేశ్ ప్రశ్నించారు