ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం చివర్లో లేదా వచ్చేవారం మొదట్లో నోటిఫికేషన్‌

national |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 12:57 PM

దిల్లీ:  ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే!.లోక్‌ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. ఈ వారం చివర్లో లేదా వచ్చేవారం మొదట్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు మీడియాకు తెలిపాయి.వారు చెప్పిన వివరాల ప్రకారం..ఏప్రిల్‌ నుంచి మే నెలవరకు 7-8దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం సమకూర్చే పనిలో ఉంది. 


వచ్చేవారం ఈ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేస్తుందని వారు వెల్లడించారు. లోక్‌ సభ పదవీకాలం జూన్‌ 3నాటికి పూర్తికానుంది. దీంతో పాటు కొన్ని రాష్ట్రాల పాలనా వ్యవధి కూడా త్వరలోనే పూర్తవనుంది. ఈ కారణంగా నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు కశ్మీర్‌లో అసెంబ్లీ రద్దయి చాలారోజులే అయింది. ఈ ఎన్నికలను కూడా లోక్‌ సభ ఎన్నికలతో పాటు కలిపి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.అయితే అక్కడ భద్రతా చర్యలను బట్టి ఎన్నికల నిర్వహణలో మార్పు ఉండవచ్చని ఆ అధికారి తెలిపారు. 


ఇక సిక్కిం అసెంబ్లీ ఈ ఏడాది మే 27 నాటికి పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పదవీ కాలం జూన్‌ 18 నాటికి, ఒడిశా జూన్‌ 11న, అరుణాచల్‌ ప్రదేశ్‌ జూన్‌ 1 నాటికి అసెంబ్లీ గడువు తీరనుంది. దేశంలో ఉన్న 543 లోక్‌ సభ స్థానాలకు గానూ 10లక్షల పోలింగ్‌ కేంద్రాలు అవసరమని ఈసీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సారి 7-8 దశల్లో ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa