అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర డిజిపి ఆర్‌పి ఠాకూర్ కోరారు. శుక్రవారం ఉదయం ఐపిఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిజిపి మాట్లాడుతూ.. రాష్ట్ర మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. సతీమణి అమితా ఠాకూర్‌తో కలిసి డిజిపి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సిఐడి, ఎపి పోలీసు ఇన్‌ఛార్జి ఎస్‌పి కెజివి సరిత లు అధ్యక్షత వహించారు. మహిళల భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు కొన్ని లఘు చిత్రాలను ప్రదర్శించారు. డిజిపి మాట్లాడుతూ... సమాజ రక్షణలో భాగంగా పోలీసు వ్యవస్థలో మహిళలు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులను అభినందించారు. మహిళల భద్రత లక్ష్యంగా ఏర్పాటు చేసిన శక్తి టీం పని తీరు అద్భుతంగా ఉందన్నారు.
అన్యాయం జరిగితే పోలీసులున్నారనే ధైర్యం ప్రజల్లో కల్పించేందుకే శక్తి టీం లతో సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సంరక్షణలో భాగంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని డిజిపి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీసుల సంఖ్యను పెంచాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. శక్తి టీంలను విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే మహిళా పోలీసుల సౌకర్యార్ధం డిజిపి కార్యాలయంలో త్వరలోనే విశ్రాంతి గదులను నిర్మిస్తామని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, లక్ష మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డిజిపి తెలిపారు. ఐపిఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు అమితా ఠాకూర్ మాట్లాడుతూ... మహిళ లేనిదే మానవ జన్మలేదని, మహిళ సమాజంలో ఓ కీలకమైన శక్తి అని పేర్కొన్నారు.
మహిళలకంటూ ఓ రోజు ఉండడం సంతోషదాయకమన్నారు. పురుషులతో సమానంగా మహిళలు సమాజంలో అన్ని పనులు చేస్తున్నారని, విమానాలు సైతం నడుపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. శక్తి టీం పనితీరును ఆమె అభినందించారు. మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని, పోలీసుల పిల్లలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఆమె ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లోని మహిళా పోలీసుల విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిజిపి హరీష్, ఐపిఎస్ అధికారులు, పోలీసుల కుటుంబ సభ్యులు, తదితరులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa