పురుషులతో పాటు సమాన అవకాశాలను కల్పించడం ద్వారా మహిళా సమానత్వాన్ని పాటించాలని, సనాతన ధర్మం ప్రకారం మహిళలను గౌరవించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో ప్రసంగిస్తూ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు ఈ ఏడాది నుండి మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి పేరిట అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు వెల్లడించారు. హిందూ సంప్రదాయంలో మహిళా దేవతామూర్తులైన శ్రీ సరస్వతిదేవి విద్యను, శ్రీ లక్ష్మీదేవి సంపదను, శ్రీ దుర్గాదేవి శక్తిని ప్రసాదిస్తారని, మానవుని మనుగడకు ఈ మూడు అంశాలు కీలకమని తెలియజేశారు. కుటుంబంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమని, పిల్లలకు చిన్న వయసు నుండే ధార్మిక చింతన, భక్తిభావం నేర్పాలని కోరారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తేనే ఏదేశమైనా అభివృద్ధి సాధించగలుగుతుందని తెలిపారు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. మహిళలకు టిటిడిలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులతో తరచూ సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తదితర కీలక స్థానాల్లో మహిళా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. మహిళా ఉద్యోగులకు ఓర్పు ఎక్కువగా ఉంటుందని, ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తుల క్యూలైన్ క్రమబద్దీకరణకు వారిని నియమిస్తున్నామని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న క్రీడా సముదాయంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తామన్నారు. మహిళలు భయాన్ని పక్కనపెట్టి దేన్నయినా సాధించగలమనే ధీమాతో ముందుకు సాగాలని ఈవో ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa