ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో మట్టికర్పించిన టీమిండియా..ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ సెమీస్ పోరులో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలర్లు సత్తాచాటగా.. అనంతరం బ్యాటర్లు సమిష్టగా రాణించారు. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ వికెట్లు కోల్పోయినప్పటికి విరాట్ మాత్రం తన క్లాస్‌ను చూపించాడు.మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. అయ్యర్(45) ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కూడా కోహ్లి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే విజయానికి మరో 39 పరుగులు కావల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు.ఆఖరిలో కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు.
"ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మనం అంచనా వేయలేం. పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. కానీ పిచ్ కూడా కాస్త మెరుగ్గా అనిపించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కంటే ఈ రోజు పిచ్ చాలా బెటర్‌గా ఉంది.ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు అద్బుతంగా రాణించారు. మేము 48 ఓవర్ వరకు గేమ్‌ను తీసుకుండొచ్చు. కానీ మా ఛేజింగ్‌లో ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్‌ను ఫినిష్ చేశాము. మాకు అదే ముఖ్యం. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిడంతోనే ఈ విజయం సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.ఇక తుది జట్టు కూర్పు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం. దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం.
విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లి మాకు ఆ భాగస్వామ్యం అందించారు. కేఎల్(రాహుల్), హార్దిక్ పాండ్యా కూడా ఆఖరిలో అద్భుతంగా ఆడారు.ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa