ఆరోగ్యశాఖ సేవా రంగమని, ఖర్చు పెట్టడమే కానీ ఆదాయం వచ్చేది ఉండదని... అలాంటి ఆరోగ్యశాఖను కూడా గత వైసీపీ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తాను రూ.6,500 కోట్ల అప్పులతో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో వైద్యఆరోగ్య శాఖపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు, మందుల సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు.. ఇలా ప్రతి విభాగాన్నీ వైసీపీ అప్పుల్లో ముంచేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఆరోగ్యశాఖకు రూ.2700 కోట్లు మూలధన వ్యయం కింద ఇచ్చారని చెప్పారు. 2025-26 బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు రూ.19,264 కోట్లు కేటాయించడం అభినందనీయమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం ఏ దేశం, రాష్ట్రంలోనైనా జీడీపీ లేదా జీఎ్‌సడీపీలో 6 శాతం నిధులు ప్రజారోగ్యానికి కేటాయించాలని, అప్పుడే ఆరోగ్య వ్యవస్థ పటిష్టమవుతుందని మంత్రి చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో ఆరోగ్యశాఖకు బడ్జెట్ పెంచాలని కోరారు. ఈ తొమ్మిది నెలల్లో ఆరోగ్యశాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
![]() |
![]() |