రాష్ట్రంలో విద్యుత్‌పై ట్రూ అప్ చార్జీల భారం మోపడంలో కర్త, కర్మ, క్రియా అంతా గత వైసీపీ సర్కారుదేనని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో మండిపడ్డారు. లక్షల కోట్లు అప్పులు చేసిన గత ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, రోడ్లపై గోతులు కూడా పూడ్చలేదని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. రోడ్లపై గోతులు పూడ్చామని చెబుతున్నారని కానీ, వాస్తవానికి ఎక్కడి గోతులు అక్కడే ఉన్నాయని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపైనా అచ్చెన్నాయుడు ధీటుగా బదులిచ్చారు. ‘మీ జిల్లాలో ఏదైనా రోడ్డు మీరే ఎంపిక చేసుకోండి. అక్కడ గతానికి ఇప్పటికీ తేడా ఎంటో చూపిస్తాం’ అని బొత్సకు అచ్చెన్న సవాలు విసిరారు. విపక్ష నేతగా బడ్జెట్‌పై మాట్లేడేందుకు బొత్సకు సమయం ఇస్తే అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.అంతకుముందు బొత్స మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరిట ప్రజలపై భారం మోపిందని అన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాస్తవాలు మాట్లాడుతుంటే తమను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా బొత్స, వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విద్యుత్తు చార్జీలు పెంచబోం. విద్యుత్ చార్జీలు పెంచబోమని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జగన్ పాలనలో 2022-23, 23-24 కాలంలో ఏపీఈఆర్‌సీ ప్రతిపాదించిన ట్రూ అప్ భారం రూ.15 వేల కోట్లపై ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |