దైవ దర్శనానికి వచ్చే వృద్ధ భక్తులను టార్గెట్ చేస్తూ.. మత్తుమందు ఇచ్చి దోచుకుంటున్న ఇద్దరిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. ఈ ఏడాది జనవరి 5న ఓ భక్తురాలు..శ్రీవారి ఆలయ తూర్పు మాడవీఽధిలోని గ్యాలరీలో కూర్చుని ఉన్న తనకు దర్శనం చేయిస్తామని నమ్మించి మత్తు మాత్రలు ఇచ్చి తాళిబొట్టు చైన్, చెవి దిద్దులు తీసుకెళ్లారని తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొందరు అనుమానితుల వీడియోలు, ఫొటోలతో తమిళనాడులోని ప్రధాన నగరాల్లో గాలించారు. భక్తురాలిని దోచుకున్నవారు తమిళనాడులోని విల్లుపురానికి చెందిన విజయ్‌కుమార్, అతని పిన్ని శారదగా తేలింది. వీళ్లిద్దరూ ఆలయాలకు వెళ్లే ఒంటరి వృద్ధు భక్తులను లక్ష్యంగా చేసుకుని, మాయమాటలు చెప్పి దగ్గరై ఆ తర్వాత ఆహారంలో నిద్ర మాత్రలు ఇస్తారు. భక్తులు మత్తులోకి వెళ్లగానే వారి శరీరంపై ఉన్న బంగారు వస్తువులను దోచుకెళుతున్నట్టు తేలింది. వీరిపై ఇప్పటికే తమిళనాడులో చాలా కేసులు ఉండటంతో పాటు జైలు శిక్షలూ అనుభవించినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. తమిళనాడులోని మూడు జిల్లాల పోలీసులు వీరి కోసం గాలిస్తున్న క్రమంలో ప్రత్యేక నిఘాతో తిరుమల పోలీసులు కాంచీపురంలో విజయకుమార్, శారదను గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 21 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు, 3 సెల్‌ఫోన్లు, 6 మత్తు మాత్రలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.
![]() |
![]() |