రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అంతర్గత జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ పనుల్లో వినియోగించాల్సిన సిమెంటు, ఇసుక, ఇనుము, కంకర, ఫ్లైయాష్ వంటి పలు ముడి సరుకులను తక్కువ ఖర్చుతో రాజధాని ప్రాంతానికి తరలించడానికి జల రవాణా చాలా అనుకూలమైందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) గతంలో కృష్ణా నదిలో చేపట్టిన అంతర్గత జల రవాణా-4 తాలూకు కార్యాచరణను వినియోగించుకోవాలని భావిస్తోంది. రోడ్డు రవాణా ఖర్చులతో పోల్చుకుంటే జల రవాణాకు అయ్యే ఖర్చు సగంలో సగం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు... టన్ను బరువున్న సరుకును కిలోమీటరు దూరం రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకు రూ.2.50 ఖర్చు అయితే, రైలు ద్వారా రూ.1.36, జల రవాణాలో రూ.1.06 మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జల రవాణాకు ప్రాధాన్యం ఇచ్చి సాగరమాల పేరుతో దేశవ్యాప్తంగా జల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లోనే ఊపందుకోనున్న నేపథ్యంలో నిర్మాణ సామగ్రి, ఇతరత్రా ముడి సరుకులను తేలికగా తరలించడంపై చర్చ మొదలైంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు, ఇటుక, కంకర వంటి మెటీరియల్ అంతా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల పరిసర ప్రాంతాల నుంచే తరలించాల్సి ఉంటుంది. ముక్త్యాల-అమరావతి మధ్య కృష్ణా నదీ మార్గాన్ని వినియోగించుకుని ముడి సరుకును జల రవాణా చేయడం.. రోడ్డు మార్గం కంటే అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. నదీమార్గంలో తక్కువ దూరంతో పాటు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. జల రవాణా కోసం కార్గో వెస్సెల్స్‌ను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
![]() |
![]() |