కాశీనాయన జ్యోతిక్షేత్రంలోని నిర్మాణాల ధ్వంసానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో లక్షలాధి మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కాశీనాయన జ్యోతిక్షేత్రంలో జరిగిన ఈ నిర్మాణాల కూల్చివేతలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీశాఖకు చెందిన అధికారులే ఒక హిందూ ధార్మిక, సేవా క్షేత్రంలో పెద్ద ఎత్తున కూల్చివేతలకు తెగబడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ..... నల్లమల అటవీప్రాంతంలోని కాశీనాయన జ్యోతిక్షేత్రం పవిత్రమైన ఆద్యాత్మిక కేంద్రం. రాయలసీమతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో కాశీనాయన క్షేత్రానికి వస్తుంటారు. ఈ క్షేత్రంపై అటవీశాఖ అధికారులు దాడి చేసి, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ సత్రాలు, గోశాల, క్షవరశాల, అన్నదాన సత్రం, వంటశాలను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేయడం దారుణం. ఇది హిందూధర్మంపై జరిగిన దాడిగా భావిస్తున్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన. రాష్ట్రంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలియకుండానే అటవీశాఖ అధికారులు ఈ ధ్వంసానికి పాల్పడ్డారా? లక్షలాధి మంది హిందువులు ఈ కూల్చివేతలపై ఆవేదన వ్యక్తం చేయడం, ఈ ప్రభుత్వంపై మండిపడుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? తన శాఖలోని అధికారులు చేసిన విధ్వంసంను, హిందూధర్మంపైన దాడిని ఆయన సమర్థిస్తున్నారా? ఇదేనా పవన్ కళ్యాణ్‌కు హిందూధర్మంపై ఉన్న నిజమైన గౌరవం? అని ప్రశ్నించారు.
![]() |
![]() |