బిహార్ దానాపూర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని ఖుష్బూ కుమారి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే మొదటి నుంచి వైద్యురాలు కావాలని కలలు కంటున్న ఖష్బూ కుమారికి తల్లిదండ్రులు.. పదో తరగతిలో 500 మార్కులకు గాను 400 మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. చెప్పినన్ని మార్కులు సాధిస్తేనే సైన్సు గ్రూపు చదివిస్తామని అన్నారు. ఇందుకు ఆమె కూడా ఓకే చెప్పగా.. బాగానే కష్టపడి చదివింది. కానీ తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్లుగా 400 మార్కులు తెచ్చుకోలేకపోయింది.
పదో తరగతిలో చెప్పిన దాని కంటే ఒక్క మార్కు తక్కువగా అంటే 399 మార్కులు సాధించింది. దీంతో తల్లిదండ్రులు ఖుష్బూ కుమారిని బలంవంతంగా ఆర్ట్స్ గ్రూపులో వేశారు. దీంతో ఆమె వైద్యురాలు కావాలన్న కల తలకిందులు అయింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. అందులో తన తల్లిదండ్రులు బలంవంతంగా తనను ఆర్ట్స్ గ్రూపులో వేశారని.. తనకి ఇష్టమైన సైన్సు గ్రూపు చదివి డాక్టర్ కావాలనుకున్నానని చెప్పింది.
అంతేకాకుండా తన అక్కలకు నచ్చిన గ్రూపు చదివే వెసులుబాటు కల్పించిన తల్లిదండ్రులు తనను మాత్రమే ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. ఒక విద్యార్థిని జీవితానికి సంబంధించిన విషయం కావడంతో అంతా ఆసక్తిగా వీడియోను చూశారు. ఇలా అతికొద్ది రోజుల్లోనే వీడియో వైరల్‌గా మారింది. అలా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన కంటపడింది. ఖుష్బూ బాధను అర్థం చేసుకున్న మంత్రి ఆ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మరీ విద్యార్థిని సైన్సు గ్రూపునకు మార్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆపై ఆయనే నేరుగా.. ఖుష్బూకు ఫోన్ చేసి సైన్సు గ్రూపులో చేర్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే సైన్స్ విభాగంలో అడ్మిషన్ గురించి దానాపూర్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు కూడా వివరించారు. నచ్చిన సబ్జెక్టు చదువుకునేందుకు.. ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాలు మీకు అండగా ఉన్నాయని చెప్పారు. అలాగే "నీట్"కు కూడా ప్రిపేర్ కావాలని సూచించారు. మంచి మార్కులు సాధిస్తే కచ్చితంగా డాక్టర్ అవుతారంటూ చెప్పారు. దీంతో ఖుష్బూ తెగ సంబుర పడిపోతుంది.
![]() |
![]() |