ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్య, వైద్యాన్ని నాశనం చేసిన ఘనుడు చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 09:12 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్-2047 ఒక బూటకమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రపంచంలోనే తాను ఒక విజనరీగా చెప్పుకునేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ల నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలుశక్తిని పెంచకుండా, రాష్ట్రంలో తన విజన్‌తో సంపదను సృష్టిస్తానంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అయన మాట్లాడుతూ...... చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ఘనమైన విజన్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించాడు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. విద్యారంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి పూర్తిగా సహకరించారు. తాను సీఎం కాదు, సీఈఓను అని పిలిపించుకునేందుకే చంద్రబాబు ఇష్టపడ్డారు. అలాగే పనిచేశారు. చివరికి చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ వామపక్షాలు ఆయనకు గొప్ప బిరుదును ఇచ్చాయి. ఎంఎస్ఎంఈ లకు బదులుగా కార్పోరేట్ సంస్థలు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మిన నాయకుడు చంద్రబాబు. విజన్ 2020 తరువాత రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య దాదాపు 70 శాతం ఉన్నట్లు తేలింది. అంటే ఆయన విజన్ వల్ల ఎక్కడ సంపద పెరిగింది? ప్రజలు సంపన్నులు ఎందుకు కాలేకపోయారు? చంద్రబాబు విజన్ వల్ల పేదరికం పెరిగింది. హైటెక్ సిటీ, చుట్టుపక్కల భూములు ఏ విధంగా ఒక వర్గానికే ఉపయోగపడేలా చంద్రబాబు విధానాలు సహకరించాయంటూ రీసెర్చ్ స్కాలర్లు పుస్తకాలు రాశారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa