ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోనూ ‘గుట్కా’ మరక.. ఇరుగుపొరుగు ఇండియన్ల గొడవ

international |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 10:03 PM

హైదరాబాద్ రోడ్ల మీద మనం సీరియస్‌గా ఏదో పని మీద వెళ్తుంటే.. ఒకడు మన పక్కనే పుచుక్కున ఊస్తాడు. పాన్ బాగా నమిలి పక్కన ఎవరు వెళ్తున్నారు.. ఇక్కడ ఊయడం కరెక్టేనా లాంటివి ఏమీ ఆలోచించకుండా రోడ్డుని ఎర్రగా మార్చేస్తాడు. ఇలాంటి వాళ్లు నార్త్ ఇండియాకి వెళ్తే ఇంకా ఎక్కువ మంది తగులుతారు. నార్త్ ఇండియా ఏంటి.. యూఎస్‌లో ఒకడు తగిలాడు. నాకు కాదులెండి.. యూఎస్‌లో ఉన్న మరో ఇండియన్‌కి. ఆ పుచుక్ గాడి బాధ అంతాఇంతా కాదంటూ.. అతనితో వేగలేకపోతున్నామంటూ రెడిట్‌లో తన ఆవేదనను రాసుకొచ్చాడు. తన దేశీ నైబర్ గురించి సుధీర్ఘంగా రాసుకొచ్చిన ఆ ఇండియన్.. వీడికసలు సివిక్ సెన్స్ లేదు అని విమర్శించాడు. ‘సమ్ ప్యూపుల్ ఫ్రమ్ ఇండియా హేవ్ జీరో సివిక్ సెన్స్’.. అంటే ఇండియా నుంచి వచ్చే కొంతమందికి కనీస ఇంకిత జ్ఞానం ఉండదు అనే టైటిల్‌తో రెడిట్‌లో పోస్ట్ చేశాడు.


రెడిట్‌లో పోస్ట్ పెట్టిన వ్యక్తి వివరాల ప్రకారం.. ఈయన గత ఆరేళ్లుగా అమెరికాలోని ఒక బిల్డింగ్‌లో ఉంటున్నాడు. ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. ఈయన ఉంటున్న బిల్డింగ్ ఉడ్‌తో కట్టినది. కాంక్రీట్ కాదు. కాబట్టి ఆ బిల్డింగ్‌లో నివసించే ఇతర కుటుంబాలు మాట్లాడేటప్పుడు, వాకింగ్, రన్నింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అది ఉడ్‌తో కట్టిన బిల్డింగ్ కాబట్టి సౌండ్ విపరీతంగా వస్తుంది. కాబట్టి, అరవడం, గెంతడం లాంటివి చేస్తే ఇతరులకు ఇబ్బంది.


అయితే, రీసెంట్‌గా ఒక ఇండియన్ కుటుంబం ఇదే బిల్డింగ్‌లో కింది అంతస్తులో దిగారు. భార్యభర్తలు, వారికి ఒక పాప, బాబు ఉన్నారు. వీళ్లు ఈ బిల్డింగ్‌లోకి వచ్చిన దగ్గర నుంచీ ఒకటే మ్యూజిక్కు. వాయించేస్తున్నారట. అరుస్తారట, గెంతుతారట, గోడలను గుద్దుతారట.. దీంతో బిల్డింగ్ మొత్తం షేక్ అవుతోందట. ఇదే బిల్డింగ్‌లో ఉన్న ఇరుగుపొరుగువారి ఇళ్లలో టీవీలు, ఫర్నీచర్ కదులుతున్నాయట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్లీ సూర్యుడు చల్లబడేవరకు ఇదే విధంగా వాయిస్తున్నారట.


మన ఇండియనే కదా వెళ్లి చెప్దాం అని ఈయన ట్రై చేశారు. అయితే, అతనితో మాట్లాడిన తర్వాత ఎదురైన అనుభవం గురించి కూడా తన పోస్టులో రాసుకొచ్చాడు. విపరీతమైన డిస్టబెన్స్ వస్తుంటే అదే బిల్డింగ్‌లో నివసిస్తోన్న అమెరికన్లు.. మన ఇండియన్‌ని అడిగారట. అయితే, ఇతడికి ఇంగ్లిష్‌లో జీరో నాలెడ్జ్ అని రెడిట్‌లో పోస్ట్ చేసిన ఇండియన్ ఆరోపిస్తున్నారు. ఇంగ్లిష్ రాకుండానే పెళ్లాం పిల్లలతో అమెరికా వెళ్లి కాపురం పెట్టేశారా? ఈయన మంటతో ఆ కామెంట్ చేసుండొచ్చని అర్థమైంది. సరే.. ఈ విషయం పక్కన పెడితే.. అమెరికన్లు అడిగేదేమీ అతడికి అర్థం కాక, ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడట. దీంతో నేనే నాలుగైదు సార్లు ఆయనతో మాట్లాడడానికి ట్రై చేశానని పోస్ట్ పెట్టిన పెద్ద మనిషి అంటున్నాడు. ఇంతకీ ఈ కొత్తగా బిల్డింగ్‌లోకి వచ్చిన ఫ్యామిలీది గుజరాత్ అట. ఆయన గుజరాత్‌లోనే అందరినీ తిడుతున్నాడట. అది అక్కడున్న అమెరికన్లకు అర్థం కావడం లేదట. దీంతో వారు మీ ఇండియన్స్ అంతా ఇంతేనా అడి అడిగితే తనకు తలకొట్టేసినట్టు అయ్యిందని పోస్ట్ పెట్టిన ఇండియన్ అంటున్నారు. ఆ గొడవ చేస్తున్న ఇండియన్ తరఫున ఈయన సారీ చెప్పాడట.


అయితే, ఈ గుజరాత్ ఫ్యామిలీ ఇక్కడితో ఆగలేదని.. అతడు గుట్కా, పాన్ నమిలి బిల్డింగ్ గోడల మీద, కింద ఉంటున్నవారి బాల్కనీలో ఊస్తున్నాడని ఆరోపించాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఉంటుందట. వాళ్ల బాల్కనీలో ఎరుపు రంగు మచ్చలు ఉన్నాయని.. వాటి నుంచి అదోరకమైన కంపు వస్తోందని వారు అంటున్నారట. బుద్ధి లేకుండా అలా ఎలా ఊస్తారండి అని ఆ సౌత్ ఇండియన్ ఫ్యామిలీలోని చిన్న పాప కూడా అడిగిందట. ఇలా అమెరికాలో ఉంటున్న ఒక ఇండియన్ గురించి మరో ఇండియన్ రాసుకొచ్చారు. గొడవ చేస్తున్నారు అంటే.. పిల్లలు ఉన్నారు కదా ఫర్వాలేదు అనుకోవచ్చు. కానీ, చెండాలంగా గుట్కా నమిలి ఊయడం అనేది మాత్రం సహించలేం. ఈ హైదరాబాద్‌లో కూడా అంతే.. ఒకవైపు GHMC సిటీ బ్యూటిఫికేషన్ పనులు చేస్తుంటే.. రంగులు వేసిన గోడల మీద, ఫ్లై ఓవర్ పిల్లర్ల మీద గుట్కా ఉమ్మి పోతున్నారు కొంత మంది ఉద్ధండులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com