నేపాల్ లో రాచరిక పాలనకు మద్దతుగా జరుగుతున్న అల్లర్లు, హింసకు మాజీ రాజు జ్ఞానేంద్ర షానే కారణమని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రజలను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నారని విమర్శించింది. అల్లర్లను అణచివేయడానికి జ్ఞానేంద్రను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై నేపాల్ ప్రధాని కే.పీ. శర్మ ఓలి ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ.. దేశంలో అల్లర్లకు కారణమైన వారు తప్పించుకోలేరని, మాజీ రాజు జ్ఞానేంద్ర కూడా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జ్ఞానేంద్ర కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి మళ్లీ రాజునవుతానని భావించే వారు ఇప్పుడు జరుగుతున్న హింసకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లర్లను, హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని ఓలి హెచ్చరించారు. కాగా, ఈ విషయంపై మాజీ రాజు జ్ఞానేంద్ర ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలు, దేశ విస్తృత ప్రయోజనాల కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమేనని జ్ఞానేంద్ర పేర్కొన్నారు. త్యాగం బలహీనత కాదని చెప్పారు.ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం అనేది చేతల్లో కంటే ఎక్కువగా మాటల్లో మాత్రమే కనబడుతోందని ఎద్దేవా చేశారు. నేపాల్ ఆర్థిక పరిస్థితి, యువత వలసలు, విద్యారంగం ఎదుర్కొంటున్న సంక్షోభం తదితర సమస్యలను ప్రస్తావిస్తూ.. గతంలో జరిగిన పొరపాట్లను ప్రజలంతా ఏకమై సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని జ్ఞానేంద్ర పిలుపునిచ్చారు. దేశం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నేపాల్ పాలకవర్గ పార్టీలన్నీ సమావేశమై మాజీ రాజును అరెస్ట్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
![]() |
![]() |