ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమి కబ్జాకు గురైతే వాటిని తిరిగి పొందడం ఎలాగో తెలుసా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 05:44 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భూమిని పొందేందుకు ఎన్నారైలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా చట్టపరమైన నిబంధనలు, భౌగోళికంగా దూరం ఉండటం, స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. మనదేశంలో భూములను పొందాలంటూ ఫెమా, ఫెరా వంటి చట్టాలపై ఎన్నారైలు అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఆస్తి లావాదేవీలకు సంబంధించిన ప్రక్రియ చాలా గజిబిజిగా ఉంటుంగి. ముఖ్యంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, ఆర్ఓఆర్ రికార్డులు పొందడం విదేశాల్లో ఉన్న ఎన్నారైలకు కష్టంగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన టైటిల్ డీడ్ క్లియర్‌గా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే భూమి లేదా ఇతరత్రా ఆస్తుల కొనుగోలు సమయంలో యాజమాన్య చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం లీగల్ అడ్వైజర్లను నియమించుకుంటే మంచిది. ఇక ఆస్తుల లావాదేవీలకు సంబంధించి ఎన్ఆర్ఐ లను ఇబ్బంది పెడుతున్న మరో అంశం.. మూలధన లాభాలపై పన్నులు. భారతీయ పన్ను చట్టాల గురించి అవగాహన లేకపోతే ఇది కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.


మరోవైపు స్థానిక మార్కెట్ ట్రెండ్, ఆస్తుల విలువ, రియల్ ఎస్టేట్ విధానాలపై అవగాహన లేకపోతే.. ఎన్నారైలు మోసపోయే ప్రమాదం ఉంది. ఇక డెవలపర్లు, ఏజెంట్లు తప్పుడు సమాచారాన్ని అందించి మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా ఎన్నారైలు విదేశాల్లో దూరంగా ఉండటంతో.. వారికి సంబంధించి భూములు ఆక్రమణలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఎక్కువ కాలం పాటు పర్యవేక్షణ లేకుండా వదిలేసిన భూమి ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఎన్ఆర్ఐలు వ్యవసాయ భూములను నేరుగా కొనేందుకు అవకాశం లేదు. మనదేశంలోని వ్యవసాయ భూమి, తోటలు లేదా ఫామ్‌హౌస్ భూమిని ఎన్ఆర్ఐలు నేరుగా కొనుగోలు చేయలేరు, ఏదైనా వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరి.


మరోవైపు భూములు ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం డిజిటల్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. అలాగే మీభూమి పోర్టల్ ద్వారా భూ రికార్డులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే ఆక్రమణకు గురైన భూమిని తిరిగి పొందడానికి న్యాయపరమైన, పరిపాలనా ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలను సేకరించాల్సి ఉంటుంది. ఆస్తి పత్రాలు, విక్రయ దస్తావేజులు, గిఫ్ట్ డీడ్లు, వారసత్వ పత్రాలు, ఆస్తి పన్నుకు సంబంధించిన రసీదులతో పాటుగా మీభూమి పోర్టల్ నుంచి పట్టాదారు పాస్‌బుక్‌లు, ఆర్ఓఆర్ 1బీ రికార్డులను సేకరించాలి. అలాగే స్థానిక సర్వే కార్యాలయం నుంచి సర్వే నంబర్లు మరియు ఎఫ్ఎంబీ స్కెచ్‌లను సేకరించాలి.


వీటి ద్వారా కబ్జాకు గురైన భూమిని ఖాళీ చేయమని.. ఆక్రమణదారుకు న్యాయవాది ద్వారా చట్టపరమైన నోటీసు పంపాలి. అలాగే భూ కబ్జా, అక్రమ ప్రవేశం, నేరపూరిత ఆక్రమణ వంటి వాటికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అప్పటికీ ఆక్రమణదారు ఖాళీ చేయని పక్షంలో.. రెవెన్యూ శాఖ జోక్యం తీసుకోవచ్చు. తహశీల్దార్ లేదా మండల రెవెన్యూ అధికారిని సంప్రదించి మరోసారి సర్వే చేయాలని కోరవచ్చు. లేదా తొలగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం, 1905 అమలు కోసం రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా జిల్లా కలెక్టర్‌కు విషయాన్ని తెలియజేయాలి.


ఆక్రమణదారు ఇంకా ప్రతిఘటిస్తే, సివిల్ కోర్టులో సివిల్ దావా వేయవచ్చు. అక్కడ కూడా ఆలస్యం జరిగితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం గురించి ఆలోచించండి. లోక్ అదాలత్‌లను సైతం సంప్రదించవచ్చు. మీ భూ రికార్డులను పర్యవేక్షించడానికి మీభూమి పోర్టల్‌ను నిరంతరం చెక్ చేస్తూ ఉండాలి. అయితే భూ ఆక్రమణల కేసులో విజయం కోసం బలమైన డాక్యుమెంటేషన్ కీలకం. ఆలస్యం అయ్యే కొద్దీ కేసు బలహీనమయ్యే అవకాశం ఉంది. అలాగే మంచి న్యాయవాది సలహాలు స్వీకరించాలి. అలాగే ప్రస్తుత భూ క్రమబద్ధీకరణ పథకాల గురించి తెలుసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com