మాజీ మంత్రి కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో సర్జరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో వైద్యం కొనసాగుతుంది. ఆయనకు ఈ నెల 2న నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైఎఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. సుమారు 8 నుంచి 10 గంటల పాటు (బుధవారం రాత్రి 8 గంటల వరకు) ఏషియన్ హార్ట్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండా ఈ సర్జరీ చేసినట్లు తెలిపారు. కొడాలి నాని కొన్ని రోజుల పాటు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు. ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని డాక్టర్లు ధ్రువీకరించారని.. మరో నెల రోజుల పాటు నాని ముంబైలోనే ఉంటారని వెల్లడించారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు.
మరోవైపు కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని గుడివాడలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. గుడివాడలోని మెయిన్ రోడ్డులోని శ్రీ విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, నీలా మహల్ రోడ్ లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసి నాయకులు ఒక్కో దేవాలయంలో నూటొక్క కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్డులోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. గుడివాడ శాసనసభ్యుడిగా ప్రజలకు 20 ఏళ్లుగా కొడాలి నాని ఎన్నో సేవలు అందించారన్నారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని ఉదయం మసీదుల్లో ప్రార్థనలు, దేవాలయాల్లో పూజలు, చర్చిలో ప్రార్థనలు చేశామన్నారు. దేవుళ్ళ దీవెనలతో కొడాలి నాని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని నాయకులు ఆకాంక్షించారు.
మాజీ మంత్రి కొడాలి నాని గత నెలలో అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గ్రాస్టిక్ సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని గుర్తించారు. మూడు రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు ఏఐజీ డాక్టర్లు గుర్తించారు.. నానికి రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం సర్జరీ చేయకూడదని నిర్ణయించారు. కానీ ఉన్నట్టుండి గత నెల 31న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ముంబైకు ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అక్కడ ఏషియన్ హార్ట్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిలో చేర్చగా.. ఈ నెల 2న నిర్వహించిన సర్జరీ విజయవంతం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆయన కోలుకోగానే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు.
![]() |
![]() |